BRS Parliamentary Party Meeting: రాబోయే పార్లమెంటరీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సిద్దిపేట (Siddipeta) జిల్లా ఎర్రవల్లిలోని (Erravalli) ఫాం హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీష్ రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలు, వైఖరిపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. కాగా, ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యి, ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు.
'మన గళం వినిపించాలి'
అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పని చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో మన గళం వినిపించాలని ఎంపీలకు సూచించారు. 'విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి గట్టిగా ప్రశ్నించాలి. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం. త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తా.' అంటూ వ్యాఖ్యానించారు.
'తెలంగాణ బలం.. బీఆర్ఎస్'
విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్ లో మాట్లాడుతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని లేవనెత్తుతామని.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణ గళం, బలం, దళం బీఆర్ఎస్ పార్టీయేనని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని.. ఆయన సూచనలకు అనుగుణంగా సమావేశాల్లో గళం వినిపిస్తామని పేర్కొన్నారు.
సర్జరీ అనంతరం తొలిసారిగా
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చేతికర్ర సాయంతో నడుస్తూ.. మెల్లగా కోలుకుంటూ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా, సర్జరీ అనంతరం తొలిసారిగా కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అటు, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందు కోసం శ్రేణులను సమాయత్తం చేస్తూనే.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సమావేశాల్లో శ్రేణులు, నేతలకు సూచనలిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు జరగనున్నాయి.
Also Read: Kadiyam Srihari: గవర్నర్ చేసింది తప్పే, బాధ్యత వహించాల్సిందే - కడియం శ్రీహరి