Kadiyam Srihari on Governor Tamilisai: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై, రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిని అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికను రాజకీయ వేదికగా మల్చుకొని గవర్నర్ మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. గత ప్రభుత్వం గురించి అనేక విషయాలను మాట్లాడుతూ.. ఆ ప్రభుత్వంలో వ్యవస్థలు నాశనం అయ్యాయని, యువత ఉద్యోగ అవకాశాల కల్పన కోల్పోయిందని అనడం హాస్యాస్పదమని కడియం అన్నారు. గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా.. ఆమె ప్రభుత్వమేనని.. అప్పుడు ఇప్పుడు గవర్నర్ తమిళ సై ఉన్నారని కడియం అన్నారు.
ఏ ప్రభుత్వం తప్పు చేసినా గవర్నర్ బాధ్యత వహించాల్సింది పోయి గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పడం కంటే గవర్నర్ తమిళసై గత ప్రభుత్వం చేసిన తప్పుకు బాధ్యత వహించాలని కడియం అన్నారు. తమిళసై బీజేపీ ప్రతినిధిగా మాట్లాడటాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తుందని కడియం చెప్పారు. రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగ బద్ధమైన పోస్టులని ఏది పడితే అది మాట్లాడకూడదని ఆయన అన్నారు.
గవర్నర్ వ్యాఖ్యలు ఇవీ
జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత తన స్పీచ్‌లో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. గత పదేళ్లు పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని తమిళిసై అన్నారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించరన్నారు. అలాంటి వారిని ప్రజలు సాగనంపారని కామెంట్ చేశారు. పదేళ్ల నియంతపాలనకు చరమగీతం పాడారని పేర్కొన్నారు. ఏక పక్ష నిర్ణయాలు, నియంతర ధోరణులు ప్రజాస్వామ్యానికి శోభనియ్యవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.