Chiranjeevi About Fans: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం దక్కింది. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించగా.. అందులో తెలుగు వారైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. కళారంగం విభాగంలో చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. తనుకు అరుదైన పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కారణం తన అభిమానులేనని ఆయన అభిప్రాయపడ్డారు.


అభిమానుల వల్లే పద్మవిభూషణ్ అవార్డు- చిరంజీవి


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించారంటే, దానికి కారణం తన అభిమానులేనని చెప్పారు. వారే లేకుంటే తనకు ఈ  పురస్కారం వచ్చి ఉండేది కాదన్నారు. “ఈ గణతంత్ర దినోత్సం నాకు ఎంతో ప్రత్యేకం. 45 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో కళామతల్లికి సేవ చేసుకోవడం సంతోషంగా ఉంది. అలాగే, నా బాధ్యతగా భావించి, ఎలాంటి విపత్తు జరిగినా, బాధితులకు అండగా నిలుస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. పాతిక సంవత్సరాల కిందట రక్తం కొరతతో ఎంతో మంది చనిపోయారు. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందులో మన బ్లడ్ బ్యాంక్ కూడా భాగం అయ్యింది. నా సేవలు గుర్తించి 2006లో పద్మభూషన్ అవార్డు ఇచ్చారు. అది ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. ఈ ఏడాది నా సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉంది. నా అభిమానుల వల్లే ఇది సాధ్యం అయ్యింది. వాళ్లందరికీ నేను రుణపడి ఉంటాను. మీ సమాజ సేవ అలాగే కొనసాగాలని కోరుకుంటాను. నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి నా ధన్యవాదాలు. పద్మ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అన్నారు.


గణతంత్ర వేడుకల్లో మెగా ఫ్యామిలీ


చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లు కూడా బ్లడ్ బ్యాంక్‌లో సందడి చేశారు. చిరంజీవి వస్తున్నారని తెలిసి అక్కడికి అభిమానులు చాలా మంది వచ్చారు. అంతకు ముందు తనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం పట్ల ఎమోషనల్ అయ్యారు.  






Also Read: మెగాస్టార్.. ఇకపై పద్మవిభూషణ్‌ చిరంజీవి - చిరుకు ప్రతిష్టాత్మక అవార్డు..