Sit May be Enquiry on TSPSC Ex Members: టీఎస్ పీఎస్సీ (TSPSC) పేపర్స్ లీకేజీతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయగా.. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు రాజీనామా చేసిన గత బోర్డుపైనా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ కు సంబంధించి పదవులకు ఛైర్మన్, నలుగురు సభ్యులు రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని.. బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే టీఎస్ పీఎస్సీ సభ్యులపై విచారణ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు సమాచారం. 


అలాగే, గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2010లో అప్పటి రంగారెడ్డి (Rangareddy) జిల్లా జేసీగా పని చేసిన జగన్మోహన్ పై అనిశా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఆయన భార్య అరుణకుమారి అప్పట్లే స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ గా పని చేస్తుండగా.. ఆమెపై కూడా కేసు నమోదైంది. అయితే, వీరిపై చట్టపరమైన చర్యలకు బదులు భారీ జరిమానా సరిపోతుందని.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013లో ఉత్తర్వులు ఇచ్చింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని ఆ వివరాలు అనిశాకు పంపాల్సి ఉంది. కాగా, వీరిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఎలాంటి వివరాలు తమకు అందలేదని.. ఆ నివేదిక తమకు పంపాలని అనిశా 2020లో తెలంగాణ సీఎస్ కు లేఖ రాసింది. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉండగా.. తాజాగా ఈ కేసుకు సంబంధించి సర్కారు దృష్టి సారించినట్లు సమాచారం.


TSPSC కొత్త టీం నియామకం


మరోవైపు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజినికుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమించారు. తంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్ పీఎస్సీ (TSPSC) సభ్యులు రాజీనామా చేశారు. దీంతో కమిషన్ ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. యూపీఎస్సీ తరహాలోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. ప్రభుత్వ ప్రతిపాదించిన వారి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపగా.. కమిషన్ కొత్త టీం సిద్ధమైంది. ఈ క్రమంలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: Republic Days 2024 Celebrations : నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు- రిపబ్లిక్‌ డే స్పీచ్‌లో తమిళిసై కామెంట్స్‌