Padma Awards  2024: తెలుగు ఖ్యాతి మరో స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలు ఆనందం వ్యక‌్తం చేస్తున్నాయి. తెలుగు  మాట్లాడే ప్రతి వ్యక్తికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ట్వీట్లు చేస్తున్నారు. వివిధ రంగాల ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకూ అందూ వెంకయ్య, చిరును అభినందిస్తున్నారు. 
 


హృదయపూర్వక అభినందనలు: రేవంత్‌ రెడ్డి


పద్మ విభూషన్ పురస్కారాలకు ఎంపికైన తెలుగు ప్రముఖులు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి… పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ ప్రముఖులు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు రేవంత్‌ రెడ్డి. ఈమేరకు ట్వీట్ చేశారు. 


క్రమశిక్షణతో విజయపథం వైపు బాటలు: చంద్రబాబు


భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,  మెగాస్టార్  చిరంజీవి  తమ తమ రంగాలలో చేసిన అసమాన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు పొందినందుకు హృదయపూర్వక అభినందనలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు.  వీరిద్దరూ కఠోర శ్రమ, దృఢ సంకల్పం, తిరుగులేని క్రమశిక్షణతో విజయపథం వైపు బాటలు వేసి - ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. 


మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు అని బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 


అన్నయ్య చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శం: పవన్


భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న చిరంజీవిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని ట్వీట్ చేశారు. 


వెంకయ్య నాయుడుకి మనస్ఫూర్తిగా అభినందనలు: పవన్‌


మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు  ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం అన్నారు పవన్. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు  సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.  వెంకయ్య నాయుడుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. 


మన ఐక్యత సామరస్యానికి చాలా ముఖ్యం: జేపీ


పద్మవిభూషణ్ అవార్డు పొందిన వెంకయ్య నాయుడు, చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ. వారి సేవలు విజయాలను అభినందిస్తున్నాము. మిగతా పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు. కులం, మతం, ప్రాంతం భాషలతో సంబంధం లేకుండా భారతీయులందరూ సాధించిన విజయాలను జరుపుకోవడం మన ఐక్యత సామరస్యానికి చాలా ముఖ్యమైనది. ప్రతిభ, నిజమైన సంపద సృష్టి  ప్రజాప్రయోజనాన్ని ప్రోత్సహించడం వంటి వాటికి విలువనిచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, వంశం, విశ్వాసం లేదా కులం కాదు.


సంతోషం, స్ఫూర్తిదాయకం: సంతోష్ కుమార్‌, బీఆర్‌ఎస్ ఎంపీ
ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన మెగా స్టార్ చిరంజీవిని  ఎంపీ సంతోష్‌ కుమార్ అభినందించారు. తెలుగు సమాజానికి గర్వకారణమని ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమకు మీ సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. 


దేశంలో రెండో అత్యున్నత గౌరవం అందుకున్న మెగాస్టార్‌తోపాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఇదే మా అభినందనలని అడవి శేషు ట్వీట్ చేశారు. వీరితోపాటు అత్యున్నత నటి & డాన్సర్ వైజయంతిమాలకు ఇతర దిగ్గజాలకు శుభాకాంక్షలు తెలిపారు. 


అజాతశత్రువు... అందరివాడు.. అందరికీ అన్నయ్య... వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ కి పద్మ విభూషణ్‌ రావడం గర్వంగా ఉందన్నారు డైరెక్టర్ హరీష్‌ శంకర్. చిరంజీవి, వెంకయ్యకు నిర్మాత, కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ శుభాకాంక్షలు తెలిపారు.