Chiranjeevi Honoured With Padma Vibhushan: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులైన పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో చిరంజీవిని పద్మవిభూషణ్‌ వరించింది. ఇప్పటికే పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న ఆయన తాజాగా పద్మవిభూషణ్‌ తీసుకోవడంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ రోజు ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో చిరంజీవికి పద్మవిభూషన్‌ ప్రదానం చేశారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మరో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. 


కాగా ఇప్పటికే చిరంజీవి అవార్డుల రారాజుగా పెరుపొందారు. సినీ రంగానికి చిరంజీవికి చేసిన సేవలకు గానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్‌ అవార్డు ఇచ్చింది. ఇక ఆయన నటించిన స్వయం కృషి, అపద్భాంధవుడు, ఇంద్ర, సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. శుభలేఖ, విజేత, స్నేహం కోసం, ముఠామేసస్త్రీ, శంకర్‌ దాదాతో పాటు పలు చిత్రాలకు ఎన్నో ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.


అంతేకాకుండా సౌత్‌ ఫర్‌ హానరరీ లెజెండరీ యాక్టింగ్‌ కెరీర్‌ పేరిట చిరంజీవికి 2006 స్పెషల్‌ అవార్డును ఫిలింఫేర్‌ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. ఇక 2010లో ఫిలంఫేర్‌ లైఫ్‌ టై అచీవ్‌మెంట్‌ అవార్డు, తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందిచంఇన సేవలకు గానూ 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. తెలుగు ఆంధ్రా యూనివర్సిటీ 2006లో చిరంజీవికి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇలా చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో అవార్డుల రారాజుగా నిలిచారు. ఇక ఆయన తరంలో పద్మవిభూషణ్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న ఏకైక నటుడిగా చిరంజీవి నిలిచారు.   


Also Read: ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం.. ఆయన కూతురు మృతి  


కరోనా కాలంలో పెద్దన్న పాత్ర పోషించిన మెగాస్టార్


కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించింది. అన్ని రంగాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు చిత్రసీమ ఏమీ అతీతం కాదు. ఆ కష్ట కాలంలో చిరంజీవి ముందడుగు వేశారు. ఇండస్ట్రీ ప్రముఖులను ఏకం చేసి పెద్దన్న పాత్ర పోషించారు. కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ఏర్పాటు చేసిన చిరంజీవి... దాని ద్వారా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు, విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు. వ్యక్తిగతంగా కొంత మందికి ఆయన సాయం చేశారు. సకాలంలో ఆక్సిజన్ లభించక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.


కొన్ని రోజులు అంబులెన్స్ సర్వీసులు నడిపారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ప్రచారం మెగా అభిమానులకు అమితానందం కలిగిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. బింబిసార ఫేమ్‌ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. 'విశ్వంభర' లో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.