BRS MLAs Protest At Gun Park: తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను (Job Calendar) విడుదల చేసింది. అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు, నోటిఫికేషన్ విడుదల తేదీ, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి.?, ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, నియామకాలు నిర్వహించే ఏజెన్సీలను సైతం అందులో పొందుపరిచారు. అయితే, ఈ జాబ్ క్యాలెండర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ మండిపడ్డారు. ఈ మేరకు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 






సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్


జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. 'ఎన్నికల్లో ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి.?. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్‌కు రావాలి. మేమంతా మా పార్టీ నేతలతో కలిసి వస్తాం. ఇక్కడకు వచ్చి నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందని అక్కడ ఒక్క నిరుద్యోగితోనైనా చెప్పించు. అలా చేస్తే మేమంతా రాజీనామా చేస్తాం. గతంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన 40 వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను ఇప్పుడు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.' అంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






దానం పరుష వ్యాఖ్యలు - బీఆర్ఎస్ సభ్యుల ఆగ్రహం


అటు, అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలపైనా తీవ్ర దుమారం రేగింది. ఆయన పరుష పదజాలం వాడారంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దానం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమస్యలపై మాట్లాడుదామంటే తమకు మైక్ ఇవ్వరని.. కానీ దానం అసభ్య పదజాలం వాడినా పట్టించుకోలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది.


దానం వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఆ సమయంలో దానం కూడా పోడియం వద్దకు రాగా.. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను వెనక్కు తీసుకెళ్లారు. ఇంత జరిగినా దానంకు మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ.. కేటీఆర్ సహా ఇతర సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే, దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్లో అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.


Also Read: Danam Nagendar : తోలు తీస్తా కొడుకుల్లారా అంటూ రెచ్చిపోయిన దానం - తెలంగాణ అసెంబ్లీలో రగడ