Buildings in Amaravati | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు ఏపీకి వచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మాణ పనులు చురుకుగా సాగాయి. ఆపై 2019 ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్ని శంకుస్థాపన జరిగినా, అక్కడే పనులు నిలిచిపోయాయి. ఏపీలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణాలపై ఫోకస్ చేసింది. వాటిని పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం చేపిస్తోంది. 


చంద్రబాబు గత ప్రభుత్వంలో ప్రారంభమై 2019 నుంచి మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు అమరావతికి వచ్చారు. మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ విషయాలను ఐఐటి ఇంజినీర్లు పరిశీలించి రిపోర్ట్ సమర్పించనున్నారు. హైకోర్టును, సెక్రటేరియట్, హెచ్ వోడి కార్యాలయాల టవర్లను ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ సర్కార్ పనులు మొదలు పెట్టింది. అయితే కొన్ని నిర్మాణాలు మధ్యలో ఉండగా, కొన్ని పునాదుల దశలోనే ఆగిపోయాయి. ఇటీవల ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి. నిర్మాణాలు నిలిచిపోయిన అమరావతి కట్టడాల సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను, ఐఏఎస్ అధికారుల నివాసాలు అంచనా వేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది.


ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు శుక్రవారం (ఆగస్టు 2న) అమరావతికి వచ్చాయి. నేటి నుంచి ఐఐటీ టీమ్స్ 2 రోజులపాటు అమరావతిలో పర్యటిస్తాయి. గతంలో చేపట్టి, మధ్యలోనే నిలిచిన ఆయా కట్టడాలను పరిశీలించి, వాటి సామర్థ్యం, నాణ్యతపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. రాజధాని అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే (CRDA) అధికారులతో రెండు బృందాల్లోని ఐఐటీ ఇంజినీర్లు విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.