Tension Due To BRS Leaders Medigadda Visit: బీఆర్ఎస్ (BRS) నేతల బృందం శుక్రవారం మేడిగడ్డ ప్రాజెక్టును (Medigadda Project) సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సహా మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి సహా ఇతర ముఖ్య నేతలంతా ప్రాజెక్టును పరిశీలించారు. బ్యారేజీలోని కుంగిన ప్రాంతాన్ని విజిట్ చేశారు. అయితే, ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు గేట్లు మూసేసి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బ్యారేజ్ మెయిన్ గేట్ ను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు వారు గేట్లు తోసుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చారు.


'బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'


మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ మొత్తం రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ దుష్ప్రచారం చేయడం సరి కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి తమపై పగ, కోపం ఉంటే తీర్చుకోవాలని.. అంతే తప్ప రాష్ట్రం, రైతులపై చూపించొద్దంటూ వ్యాఖ్యానించారు. 1.6 కి.మీ బ్యారేజ్ లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండూ కొట్టుకుపోయాయని.. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయని గుర్తు చేశారు. వాటిపై తాము రాజకీయాలు చేయలేదని.. నిపుణుల సలహాలు తీసుకుని వరదలు వచ్చేలోగా మేడిగడ్డను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు, మేడిగడ్డలో కుంగింది 2 పిల్లర్లు మాత్రమేనని.. వాటిని సరిచేసి వ్యవసాయానికి నీళ్లివ్వాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని పేర్కొన్నారు.


కాగా, ఫిబ్రవరి 13న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి..  అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహా, మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అయితే, ప్రభుత్వం దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తామని బీఆర్ఎస్ నేతల బృందం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలు ప్రాజెక్టును శుక్రవారం సందర్శించారు. 


పేలిన బస్సు టైరు


మరోవైపు, చలో మేడిగడ్డ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైర్ పగిలింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఆర్టీసీ కాలనీ సమీపంలో హైదరాబాద్ - భూపాలపల్లి బై పాస్ పై ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా బస్సులోని నేతలు, మీడియా ప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సుకు మరమ్మతులు పూర్తైన అనంతరం వారంతా అక్కడి నుంచి బయలుదేరారు.


Also Read: Minister Komatireddy: 'రాజీనామా చేద్దాం, సిరిసిల్లలోనే తేల్చుకుందాం' - కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి సవాల్