International Business Report 2023: అంతర్జాతీయంగా ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నా భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం సానుకూలంగా ముందుకు దూసుకుపోతోంది. International Business Report (IBR) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. IBRతో పాటు Grant Thornton సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. భారత్‌లో దాదాపు 80% మేర మిడ్ మార్కెట్ బిజినెస్ వచ్చే 12 నెలల పాటు సానుకూలంగానే ఉంటుందని అంచనా వేశాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఇది 78% మేర పెరిగే అవకాశముందని వెల్లడించింది. 2023లో జూన్-డిసెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. భారత్‌లో పరిస్థితి ఇలా ఉంటే అటు Asia Pacific Regionలోని దేశాల్లో మాత్రం 2023లో మొదటి ఆరు నెలలతో పోల్చుకుంటే తరవాతి ఆరు నెలల్లో అంచనాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందన్న విశ్వాసం తగ్గిపోయింది. ఈ సర్వే ఫలితాలపై Grant Thornton Bharat ప్రతినిధి సిద్ధార్థ్ నిగమ్ స్పందించారు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ భారత్‌లో వ్యాపార రంగాన్ని సానుకూల దిశలో తీసుకెళ్తోందని ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అందుకు కారణమని వివరించారు. 


"భారత్‌లో ఆర్థిక పరంగా మేం ఊహించిన దాని కన్నా ఎక్కువ సానుకూలత వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది కాలంలో తమ బిజినెస్‌  పెరుగుతుందని 83% మేర మిడ్ మార్కెట్ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా వ్యాపారావకాశాలు పెరుగుతాయన్న నమ్మకం బలపడుతోంది. పైగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డిజిటల్‌ ట్రాన్‌ఫర్మేషన్‌ లాంటివి అందుకు దోహదపడుతున్నాయి. ఆర్థిక పరంగా వృద్ధి సాధిస్తే...అటు ఉద్యోగావకాశాలూ పెరుగుతాయి. 78% మేర కంపెనీలు కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశముంటుందని నమ్ముతున్నాయి"


- సిద్ధార్థ నిగమ్, గ్రాంట్ థార్న్‌టన్ భారత్ 


అటు కొత్త టెక్నాలజీని వినియోగించుకోడంలోనూ భారత్ ముందుంటుందని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్‌ని పెద్ద ఎత్తున వినియోగించుకునే అవకాశముందని 72% మేర సంస్థలు వెల్లడించాయి. ఈ రంగంలో పెట్టుబడులూ పెరిగే అవకాశాలున్నాయి. అయితే...ఈ సాంకేతికత విప్లవం కారణంగా అప్‌స్కిల్లింగ్ కోసం 44% మేర ఖర్చులు పెరుగుతాయని అంచనా వేశారు. AI టెక్నాలజీ వల్ల వినియోగదారుల అంచనాలకు మించి సర్వీస్‌లు అందించేందుకు వీలుంటుందని 58% మేర సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ సర్వేపై Grant Thornton Bharat టెక్‌లీడర్ రాజా లహ్రీ స్పందించారు. సంస్థలు కొత్తగా వస్తున్న టెక్నాలజీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, వాటికి తగ్గట్టుగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. 


"మార్కెట్‌లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు ఒక్కోసారి సవాలుగా మారుతుండొచ్చు. ఆదాయం తగ్గిపోతుంది. మార్కెట్ షేర్స్‌ పడిపోతాయి. ఈ సవాళ్లను దాటుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. AI,Cloud తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి"


- రాజా లహ్రీ, టెక్‌ లీడర్, గ్రాంట్ థార్న్‌టన్ భారత్ 


ఏంటీ IBR..?


మిడ్ మార్కెట్‌ కంపెనీల స్థితిగతులపై ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ సర్వే చేస్తుంది. సర్వేలు చేయడంలో ప్రపంచంలోనే టాప్ కంపెనీల్లో ఇదీ ఒకటి. ఏడాదికి రెండు సార్లు ఈ సర్వే నిర్వహిస్తుంది. రకరకాల ఇండస్ట్రీలకి చెందిన ఆయా కంపెనీల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్‌లు, ఛైర్‌పర్సన్స్, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తుంది.