కన్నుల పండువగా తెలంగాణ సాంస్కృతిక సంబురం
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఊరూరా మొదలయ్యే సందడి నెల రోజులు కొనసాగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ప్రతిపల్లె హోరెత్తిపోతోంది. ఈ ఏడాది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూనే సంబురాలు జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆది, బుధవారాల్లో బోనాల జాతర జరుగుతుంది. గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.
తెలంగాణకు ప్రత్యేకమైన బోనాల జాతరను కాకతీయుల కాలంనుంచే నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. అప్పట్లో ఈ సీజనల్లో వర్షాలు ఎక్కువగా కురిసేవి. పారిశుద్ధ్య లోపంతో కలరా, ప్లేగు లాంటి అంటురోగాలతో అల్లాడేవారు. ఈ రోగాల బారి నుంచి కాపాడాలని ప్రజలు శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని కొలుస్తారు.
బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యం. పండుగరోజు తెల్లవారుజామున మహిళలు మట్టిపాత్రల్లో కట్టెల పొయ్యిపై అమ్మవారికి నైవేద్యం వండుతారు. వండడం పూర్తయిన తర్వాత కుండను శుభ్రపరిచి పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరిస్తారు. దానిపై దీపం వెలిగిస్తారు. తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మవార్లకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, పిల్లా పెద్దా చల్లగా ఉండాలని అమ్మను వేడుకుంటారు.
కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాకను సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేస్తారు. కడుముంతలో పోసి దానిపై దివ్వెపెట్టి బోనం జ్యోతి వెలిగిస్తారు. ఆ తీర్థంలో వేపకొమ్మలు ఉంచి ,బోనంపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
బోనాల పండుగ ఊరేగింపులో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీరు ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో భవిష్యవాణి వినిపిస్తారు. గ్రామ దేవతలైన ఓరుగంటి రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెల్లకు ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు, అక్క ఎల్లమ్మ ఆరుగురు చెల్లెళ్లకు ఒక్కో పండుగను ఏర్పాటు చేసింది. అయితే తమ్ముడికి ఎలాంటి పండుగను ఏర్పాటు చేయలేకపోయానని ఎల్లమ్మ బాధ పడుతుండగా పోతరాజు, మీరు వెలిసిన గ్రామాల్లోకి నుంచి దుష్టశక్తులు చొరబడకుండా గ్రామ పొలిమేరల్లో నేను కాపలాగా ఉండి కాపాడుతానని ఎల్లమ్మకు చెప్పినట్టు పురాణ కథ ప్రచారంలో ఉంది.
ఆషాడమాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు ఈ ఏడాది ఆగస్టు 8 తో ముగుస్తున్నాయి. ఈ సంప్రదాయం కులికుతుబ్‌షా కాలం నుంచి వస్తోంది. లంగర్‌హౌజ్ నుంచి తొట్టెల ఊరేగింపు, చోటాబజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం నిర్వహించడం కూడా సంప్రదాయం.
బోనాల పండుగ కోసం ప్రభుత్వం ఈ ఏడాది 15కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటూ జరిగే బోనాల్లో ముఖ్య ఘట్టాలైన లష్కర్ బోనాలు జూలై 25న, రంగం కార్యక్రమం జూలై 26న జరగనున్నాయి.
ఈ ఏడాది బోనాల షెడ్యూల్ ఇది…
జూలై 11న మొదటి పూజ
15న 2వ పూజ
18న 3వ పూజ
22న 4వ పూజ
25న 5వ పూజ,
29న 6వ పూజ
ఆగస్టు 1న 7వ పూజ
5న 8వ పూజ
8న 9వ పూజ