BJPLP: బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లను మాత్రమే గెలుచుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగి ఉన్న బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు పలువురు లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన త్వరలో హస్తం గూటికి చేరతారనే టాక్ నడుస్తోంది. అలాగే మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారడ్డి కూడా రేవంత్‌తో భేటీ అయ్యారు. దీంతో పాల్వాయి హరీష్ బాబుతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారనే చర్చ జోరుగా నడుస్తోంది. గత కొంతకాలంగా హరీష్ బాబు కాషాయ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. పార్టీ నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో కూడా హరీష్ బాబు పాల్గొనడం లేదు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో పార్టీ మారేందుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ తరుణంలో త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏలేటి ట్వీట్ చేయడం కీలకంగా మారింది. పార్టీ మారకుండా నేతలు, శ్రేణులను కంట్రోల్ చేసేందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ.. 10 సీట్లను గెలుచుకోవాలనేది టార్గెట్ పెట్టుకుంది. అందుకు తగ్గట్లు వ్యూహలకు పదునుపెడుతోంది. విజయ సంకల్ప యాత్ర పేరుతో రథయాత్రను చేపట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రలు, బీజేపీ అగ్రనేతలు ఈ యాత్రలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందింది. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారితే పార్టీ నేతలు, కార్యకర్తలు డీలా పడే అవకాశముంటుంది. అందుకే ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాషాయదళం నిమగ్నమైంది. దీంతో నేతల్లో జోష్ నింపేందుకు త్వరలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏలేటి వ్యాఖ్యలు కూడా అందులో భాగమేననని అంటున్నారు.
అటు బీఆర్ఎస్ కూడా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేస్తోంది. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ గులాబీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయంటూ ప్రజల్లో సానుభూతి పొందుతోంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ ఎపిసోడ్ కొనసాగే అవకాశముంది.