Vemireddy Prabhakar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యానని చెప్పారు మాజీ మంత్రి నారాయణ. టీడీపీ నేతలతో కలిసి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు నారాయణ. త్వరలోనే వేమిరెడ్డి టీడీపీలో చేరతారని అన్నారు. తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో నెల్లూరు టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిని టీడీపీ ప్రకటించలేదు. ఆ స్థానాన్ని వేమిరెడ్డితో భర్తీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీ నేతలను ఆహ్వానిస్తూ వేమిరెడ్డి కూడా బిజీ అయిపోయారు. అయితే ఆయన మాత్రం టీడీపీలో చేరే విషయంపై నేరుగా స్పందించలేదు.


నిన్న సోమిరెడ్డి కూడా..
వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా నిన్న కలిశారు. టీడీపీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు వేమిరెడ్డిని సోమిరెడ్డి కలిసి టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే, ఫిబ్రవరి 21న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైసీపీకి రాజీనామా ఇచ్చారు. ఈ మేరకు ఇద్దరూ రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.


రాజ్యసభ పదవికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ  క్రమంలో సాయంత్రం ఆయనతో భేటీ అయిన సోమిరెడ్డి..టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయడం మంచి పరిణామమని, వేమిరెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేసే నేత కాదని అన్నారు. వైసీపీలో ఇమడలేకే వేమిరెడ్డి బయటకు వచ్చారని సోమిరెడ్డి తెలిపారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు.