Raghunandan Rao: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు అన్నారు. ఫామ్ హౌజ్ భూమికి సంబంధించిన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరణపై రఘునందన్ రావు మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి అనేక విషయాల గురించి సూటిగా చెప్పకుండా దాటవేశారని విమర్శించారు. ఆర్డీవో ఆఫీసులో డాక్యుమెంట్స్ ఉంటే రైతులకు ఎందుకు పహానీలు ఇవ్వడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. చైనాకు చెందిన ఓ వ్యక్తితో నిరంజన్ రెడ్డి తరచూ మాట్లాడినట్లు ఆరోపించిన రఘునందన్ రావు.. చైనా వాసి 'మో' వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఈడీకీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి దత్త పుత్రుడైన గౌడ్ నాయక్ పై ఆదాయ పన్ను అధికారులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.


వియ్యంకుడిని వైస్ ఛాన్స్ లర్‌గా నియమించారు! 
వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతిగా మంత్రి నిరంజన్ రెడ్డి తన వియ్యంకుడిని నియమించారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. మంత్రి పొలం, ఇల్లు రూ. 4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని వ్యాఖ్యానించారు. మంత్రి భూమి వరకు 3 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేశారని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శలు చేశారు. అయితే ఈ సీసీ రోడ్డును రైతులతో కలిసి నిర్మించుకున్నట్లు మంత్రి చెప్పారని, రూ. 5 కోట్ల ఖర్చు అయ్యే సీసీ రోడ్డును రైతులంతూ కలిసి చందాలు వేసుకుని నిర్మించారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ దత్తపుత్రుడైన గౌడ్ నాయక్ కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. చైనాకు చెందిన 'మో' అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డికి సంబంధాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. చైనా వ్యక్తికి మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని సార్లు ఫోన్ చేయడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. 


12 కోట్ల ఇల్లుంటే 4 కోట్లకే అమ్మేస్తా..


మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమంగా భూములు కూడగట్టారంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై నిరంజన్ రెడ్డి నిన్న స్పందించారు. రఘునందన్ రావు కనీస సమాచారం తెలుసుకోకుండా ఎవరో నాలుగు కాగితాలు ఇస్తే ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజంగా తనకి 12కోట్ల విలువైన ఇళ్లున్నాయని రఘునందన్ రావు చేసిన ఆరోపణలు నిజమే అని నిరూపిస్తే, వాటికి అంత రేటేగనుక ఉంటే, అన్నీ ఆయనకే రాసిస్తానని సవాల్ విసిరారు. నిజంగా అంత ధర ఉంటే, డీడీ తీసుకుని రఘునందన్ రావు వస్తే రూ. 4 కోట్లకే అమ్ముతా అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.


రఘునందన్ రావుకు ఆసక్తి ఉంటే, రూ. 4 కోట్లకే అమ్ముతా..


ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు థర్డ్ క్లాస్ ఆరోపణలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సర్వే నెంబర్ 60లో సర్వే చేయాలని సవాల్ విసిరారు. రఘునందన్ రావు తన భూముల దగ్గరకు ఎప్పుడు వస్తారో చెప్తే నేనే దగ్గర ఉండి చూపిస్తా అన్నారు. ఒక్క మచ్చలేకుండా 25 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశాను. మేం భూములు కొంటే, ఆ కాగితాలు దగ్ధం అయ్యాయని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.