BJP Raghunandan : భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా ఇటీవల ప్రకటించిన తోట చంద్రశేఖర్‌కుచెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి రూ. 4 వేల కోట్ల రూపాయల మియాపూర్ భూములను అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఖమ్మం సభకు ఆర్థికవనరులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని హైదరాబాద్‌లో నిర్వహించన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్ళు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తోట చంద్రశేఖర్ కు 40ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉందన్నారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ... దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్ తోట చంద్రశేఖర్ కు అప్పగించారన్నారు. మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. తోట చంద్రశేఖర్ భూములపై ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు. వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా అని నిలదీశారు. తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. మియాపూర్ భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు.
సర్వే నంబర్ 78లో జరుగుతోన్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని.. 8ఎకరాలకు ఒక న్యాయం, 40ఎకరాలకు ఒక న్యాయమా అని రఘునందన్ ప్రశ్నించారు. మియాపూర్ భూముల రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. సర్వే 78లో 40ఎకరాల భూములను తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారన్నారు. బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కవని.. అందులో భాగంగానే బీహార్ కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారని మండిపడ్డారు. గతంలో దొంగలుగా కన్పించిన ఆంధ్ర వాళ్ళు.. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుగా మారిపోయారని.. చెప్పు చేతల్లో పెట్టుకునేందుకే.. డైరెక్ట్ గా రిక్రూట్ అయినవారిని కాకుండా.. కన్ఫర్డ్ ఐఏఎస్ లను కలెక్టర్లుగా నియమిస్తున్నారని విమర్శించారు.
ఇటీవలే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రేశఖర్ ను కేసీఆర్ నియమించారు. అంతకు ముందు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. మహారాష్ట్ర క్యాడర్‌లో పని చేసేవారు. వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తన కుమారులతో కలిసి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీనే మియాపూర్ భూముల్ని కొన్నారని.. రఘునందన్ ఆరోపిస్తున్నారు.