విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు సీటు ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించారు. అంతే కాదు తాను ఢిల్లీ స్థాయి నేతనని కేశినేని నాని వ్యాఖ్యానించారు.


బెజవాడ టీడీపీలో వరుస హీట్ కామెంట్స్... ఎంపీ కేశినేని నాని చేస్తున్న వరుస కామెంట్స్ తో ఆ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అసలే ఒక వైపున అధికార పక్షంపై పైచేయి సాధించేందుకు ప్రతిపక్ష పార్టీగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ టీడీపీ, వరుస వివాదాదాలు, గొడవలతో బిజీగా ఉండగా, ఇటు ఇంటి పోరు అన్నట్లుగా కేశినేని నాని వైఖరి తయారయ్యింది. పార్టీలో ప్రక్షాళన జరగాలని వ్యాఖ్యానించిన కేశినేని నాని, కొందరికి టికెట్ ఇస్తే పార్టీకి పని చేయనని సంక్రాంతి సందర్భంగా ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నాని సొంత పార్టీ నేతల పైనే తీవ్ర స్దాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల పేర్లు పిలవకుండానే, వారిని ల్యాండ్ గ్రాబర్లు, రియల్ మాఫియా, కాల్ మని, సెక్స్ రాకెట్ నిర్వహించే వారంటూ అంటూ పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయం పై పార్టీ నేతలు ప్రశ్నించినా తాను ఎవరి పేరు పెట్టి విమర్శించలేదు కాదా అంటూ కేశినేని నవ్వుతూనే మాట్లాడుతున్నారని అంటున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలకు సైతం తలనొప్పిగా మారిందని అంటున్నారు.


పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారనుకుంటే...
 బెజవాడ కేంద్రగా పార్టీకి పెద్ద దిక్కువగా ఉంటారనుకుంటే ఎంపీ కేశినేని నాని చేస్తున్న కామెంట్స్ పై పార్టీ నేతలు  తలలు పట్టుకుంటున్నారు. నాని ఎందుకు ఇంతగా ఫ్రషన్ కు గురవుతున్నారు, కారణాలు ఏంటనే దాని పై టీడీపీ నేతలు ఆరా తీస్తుండగా, అదే సమయంలో కేశినేని నాని రిపీటెడ్ గా చేస్తున్న స్టేట్ మెంట్ లు పార్టీ నేతలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.


మద్యం, మనీ, మీడియా అంటూ కేశినేని కామెంట్స్..  
తాను చేసిన కామెంట్స్ కు బదులుగా అనని విషయాలను ప్రచారం చేస్తున్నారని, కానీ తాను చేసిన మంచి పనులను ఎందుకు చూపించరంటూ కేశినేని మీడియా పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాలోని కొందరు మద్యం, మనీ కోసం అమ్ముడుపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదన్నారు. అదంతా పెయిడ్ మీడియా ప్రచారంగా అభివర్ణించారు. సంక్రాంతి పండుగకు క్యాసినో, కోడి పందాల నిర్వాహకులు వచ్చినట్లుగానే ఎన్నికల ముందు ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌ల పేరుతో కొందరు పుట్టుకొస్తారంటూ మరోసారి తన సోదరుడు కేశినేని చిన్నిని ఉద్దేశించి నాని వ్యాఖ్యలు చేశారు.


ప్రజాస్వామ్యంగా ఎన్నికై రెండు సార్లు ఎంపీగా పని చేశానని, తాను వచ్చాకే టీడీపీలో వలసలు ఆగాయన్నారు. చంద్రబాబు పాదయాత్రలో కూడా కీలకంగా వ్యవహరించానని, నిస్వార్దంగా పని చేశానని గుర్తు చేశారు. 265గ్రామాల్లో టాటా ట్రస్ట్ తీసుకువచ్చానని ఈ విషయాన్ని మీడియా ఏరోజు ప్రధాన వార్తగా రాయలేదన్నారు. రాజకీయాల్లోకి రావటం వలన ఎంత నష్టపోయానో తనకు తెలుసన్నారు. ఒక అవినీతి అధికారి చేసిన విమర్శల కారణంగా బస్సుల వ్యాపారంలో కింగ్ గా ఉన్న తాను తన బిజినెస్ ను కూడా వదులుకున్నానని గుర్తు చేశారు. భారతదేశంలో 540 మంది ఎంపీలో ఎవ్వరూ చేయలేని పనులు తాను చేశానని అన్నారు. తనను వ్యక్తిగతంగా దిగజార్చాలని ప్రయత్నించవద్దు అని, మీరు ఎంత ప్రయత్నిస్తే అంతగా తన పాపులారిటీ పెరుగుతుందని కేశినేని సవాల్ విసిరారు.