వచ్చే ఎన్నికల్లో పార్టీలు గెలులుచుకనే సీట్లపై మంత్రి ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి ఎవరితో పోటీ ఉంటుందో వివరించారు. తాను చేసిన సర్వేల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయంటూ కీలక కామెంట్స్ చేశారు. 


తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. మహబూబాబాద్‌ జిల్లాలోని నరసింహుల పేట మండలం కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ కామెంట్స్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో వైరల్‌గా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకతత  ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. 17 నుంచి 20 మంది సిట్టింగ్‌లను మారిస్తే మాత్రం బీఆర్‌ెస్‌ వందకుపైగా సీట్లు ఖాయమన్నారు. 


తన సర్వే ఎప్పుడూ తప్పుకాలేదన్న ఎర్రబెబ్లి... ఈసారి కూడా నిజం అవుతందని కామెంట్స్ చేశారు. తాను వ్యక్తిగతంగా చేసిన సర్వేలు చూస్తే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీ 80 నుంచి 90 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగానే ఆ సీట్లు కోల్పోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్‌ అంటే ఇష్టమే కానీ... స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగానే బీఆర్‌ఎస్‌కు జనాలు ఓటు వేయబోరని అన్నారు. వారి స్థానంలో వేరేవాళ్లకు స్థానం కల్పిస్తే మాత్రం మరో ఇరవై స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు. 


బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజల్లో బలం లేదని ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్‌.  బీజేపీకి 15 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్‌ 20 నుంచి 25 స్థానాలు మాత్రమే వస్తాయని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. మరికొన్ని జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.