ఈ వార్‌ ఇప్పట్లో తగ్గదా ? తాడో పేడో తేలాల్సిందేనా ? ఎవరి గురించి…ఏ విషయంలో అంటారా ? బీజేపీ వర్సెస్‌ టీ ఆర్‌ ఎస్‌ ల మధ్య గతకొన్నాళ్లుగా తెలంగాణలో వార్‌ నడుస్తోంది. ఇది రోజురోజుకి మరింత ముదురుతోంది. సిఎం కెసిఆర్‌ను జైల్లో పెట్టిస్తామన్న కమలం పార్టీ ఆప్రయత్నాలు మొద‌లుపెట్టామ‌ని చెప్తోంది. పక్కా ఆధారాలతో ప్రజల ముందు కెసిఆర్‌ ని దోషిగా చూపించాలని తాపత్రయపడుతోంది. 


మొన్నటివరకు ఉనికి కోసం పాకులాడిన బీజేపీకి జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు ఊపిరిపోశాయి. ఊహించని విధంగా ప్రజల నుంచి మద్దతురావడం దీనికి తోడు టీఆర్‌ ఎస్‌ కి వ్యతిరేకంగా బైపోల్స్‌ లో తీర్పురావడంతో కాషాయం పార్టీకి కిక్ రెట్టింపు అయ్యింది. ఇక ఆధైర్యంతో దూసుకుపోతున్న పార్టీకి మొన్నటి బీజేపీ జాతీయకార్యవర్గసమావేశాలు జోష్‌ ని నింపాయి. మోదీ సభకు భారీగా హాజరుకావడంతోపాటు ప్రజల్లో ఉత్సాహం కనిపించడంతో బీజేపీకి బలం రెట్టింపు అయినట్లు ఉంది. ఇక రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారన్న ధీమాతో ఉంది. 


అవినీతిని బ‌య‌ట‌పెడ‌త‌రా?


అంతేకాదు కెసిఆర్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని చెబుతూ ఆ కుటుంబపాలనలో సాగిన అవినీతిని బయటపెట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందులోనే భాగంగా ఆపార్టీ నేత బండి సంజయ్‌ ఊహించని ఆయుధాన్ని బయటకు తీశారు. సమాచారహక్కు చట్టం కింద కెసిఆర్‌ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీఐ చట్టం కింద దాదాపు 90 అర్జీలు దాఖలు చేశారు. అన్ని శాఖల్లోని లెక్కలను కోరుతూ పెట్టిన ఈ దరఖాస్తులతో సిఎం కెసిఆర్‌ 8 ఏళ్ల పాలనలో ఎక్కడెక్కడ..ఎంతెంత అవినీతి జరిగిందో లెక్కలతో సహా బయట పెట్టనున్నారు. అంతేకాదు కుటుంబపాలనలో జరిగిన ఈ అవినీతి, అక్రమాలని ప్రజల ముందుంచాలన్నది బీజేపీ ప్లాన్.


ఇంతకీ కమలం పార్టీ ఎందుకీ సమాచారహక్కుచట్టాన్ని ప్రయోగిస్తోంది అంటే కెసిఆర్‌ ని జైలు పాలు చేయడానికే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆపార్టీ నేతలు తెలంగాణ సిఎం అవినీతిని బయటపెడతామని సవాల్‌ చేశారు. అంతేకాదు జైలుకి కూడా పంపిస్తామని హెచ్చరించారు. తాజాగా జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లోకూడా జాతీయ నాయకులు టైం వ‌చ్చిన‌ప్పుడు అన్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయి అన్నారు. మ‌రి టైం ద‌గ్గ‌ర‌కు వచ్చిందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 


మేము లెక్క‌లు తీస్తాం - టీఆర్ఎస్. 


ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రుణభారాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గానూ 19వేల కోట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదో అస్త్రంగా మార‌నుంది. మరోవైపు టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కూడా బీజేపీ దూకుడుకి బ్రేక్‌ వేయాలనుకుంటోంది. మోదీ జాత‌కం అంతా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో రెడీ గా ఉంది, ఎవ‌రెవ‌రికి ఎంత దోచిపెట్టారో చిట్టా అంతా ఉంద‌ని మొన్నీమ‌ద్య కేసిఆర్ కూడా అన్నారు. రాష్ట్రానికి మోదీ సర్కార్‌ ఎలా అన్యాయం చేసిందన్న వివరాలను ప్రజల ముందుంచాలని భావిస్తోంది. బీజేపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలెట్టిందన్న వార్తలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.  


ఏ సమాచారహక్కుచట్టంతో అయితే బీజేపీ లెక్కలు బయటపెడుతుందే.. అదే రూట్లో కేంద్రం అవినీతే కాదు ఆయా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతిని కూడా బయటపెట్టాలని భావిస్తోంది. దెబ్బకు దెబ్బ తీసి తెలంగాణలో కమలం గుర్తు లేకుండా చేయాలన్న కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో తెలంగాణలో ఈసారి బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ ఎస్‌ అధికార పోరు రసవత్తరంగా మారుతోంది. ఎవ‌రు ఎవ‌రి బండారం బ‌య‌ట‌పెడ‌తారో చూడాలి.