పోలవరం(Polavaram) ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో భద్రాచలం(Bhadrachalam) అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది అంటున్నారు ఆ ప్రాంత నేతలు. తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంగా భద్రాచలం ఉండటంతో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా కనీసం భూమి దొరక్కని పరిస్థితి నెలకొందంటున్నారు. అందుకే విలీనం చేసిన గ్రామపంచాయతీలో కనీసం ఐదింటిని తెలంగాణ(Telangana)లో కలపాని ఉద్యమించారు.  ఇది భద్రాచలం అభివృద్ధికి తోడ్పడుతుందన్నది అఖిలపక్షం ప్రధాన డిమాండ్. అందుకే వాళ్లంతా ఆందోళన బాటపట్టారు. 


2014లో ఏం జరిగిందంటే..


2014 జూన్‌లో తెలంగాణ ఆవిర్భావంతో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కూనూరు, చింతూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పాక్షికంగా పోలవరం ముంపు గ్రామాల పేరుతో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో కలిపారు. సదరు మండలాలు, గ్రామాలను ఏపీలో కలిపే టైంలో ఇక్కడి ప్రజల మనోభావాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా అశాస్త్రీయంగా కలిపారని తెలంగాణ నేతలు ఎప్పటి నుంచే ఆరోపిస్తున్నారు. భద్రాచలం మండలంలోని పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాల ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


విలీన గ్రామాలతో విడదీయలేని అనుబంధం..


భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిపిన పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం గ్రామాలకు భద్రాచల ఆలయంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నది. ఎటపాకలో శ్రీరాముని జటాయివు మండపం ఉండగా, గుండాలలో సీతమ్మతల్లి కోసం నిర్మించినట్టు ఉష్ణగుండాలు ఉన్నాయి. ఇక భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామికి గల వ్యవసాయ భూముల్లో సుమారు 900 ఎకరాలు పురుషోత్తమపట్నంలో ఉన్నాయి. ఇంతటి చారిత్రక ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలిపాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.


ఏపీలో మండలంగా ఎటపాక..


అప్పట్లో భద్రాచలం మండలంలో ఉన్న ఎటపాక గ్రామాన్ని ఏపీ ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించింది. ఇక భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాలంటే ఆంధ్రపదేశ్‌ రాష్ట్రంలో మండలంగా ఉన్న ఎటపాకను దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భద్రాచలం మండలంలోని సదరు ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌(TRS) చేస్తున్న ప్రయత్నాలు ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. మళ్లీ తెలంగాణలో కలుస్తామన్న భరోసా కలుగుతున్నది.


మళ్లీ భద్రాచలంలో కలపాలి..ఏపీలో విలీన గ్రామాల ప్రజలు ...


ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ప్రజలకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కన్నాయిగూడేనికి చెందిన పిల్లలు చదువుకోవాలంటే ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. కోర్టు, స్కూళ్లు, కాలేజీలు అన్నీ దూరమయ్యాయని వాపోతున్నారు. జిల్లా అధికారిని కలవాలంటే 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని కాకినాడకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఏపీ సరిహద్దుకు చివరగా ఉండటంతో అభివృద్ధి లేకుండాపోయిందని, వెంటనే విలీనం చేసిన గ్రామాల్లో ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పుణ్యక్షేత్రమైన భద్రాచలం అభివృద్ధి చెందడంతోపాటు విలీన గ్రామాలలోని ప్రజల ఇబ్బందులు తగ్గుతాయని కోరుతున్నారు.