టాటా మోటార్స్ లాంచ్ చేసిన కార్లలో అల్ట్రోజ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ కారు లాంచ్ అయి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఇందులో డార్క్ ఎడిషన్ మోడల్ కూడా లాంచ్ చేశారు. దీని ధరను రూ.7.96 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. మిడ్ లెవల్ ఎక్స్‌టీ ట్రిమ్ ఆధారంగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించారు.


ఈ కొత్త వేరియంట్‌తో పాటు పాత వేరియంట్లకు అప్‌డేట్స్‌ను కూడా టాటా అందించింది. టాప్ స్పెసిఫికేషన్లు ఉన్న టాటా అల్ట్రోజ్ డార్క్ ఎక్స్‌జెడ్+ ట్రిమ్ లెవల్‌కు కొత్త ఇంజిన్, అదనపు ఫీచర్లను అందించింది. టాటా అల్ట్రోజ్ ఎక్స్‌టీ డార్క్ పెట్రోల్ వేరియంట్ ధర, మామూలు పెట్రోల్ వేరియంట్ కంటే రూ.46 వేలు ఎక్కువగా ఉండనుంది.


కొత్త వేరియంట్‌లో కాస్మో బ్లాక్ కలర్ ఆప్షన్, హైపర్ స్టైల్ వీల్స్, డార్క్ బ్యాడ్జింగ్, పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్ కలర్ థీమ్, లెదర్ సీట్లు, హైట్ అడ్జస్ట్ చేయదగిన డ్రైవర్ సీటు, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, వెనకవైపు హెడ్ రెస్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి.


ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన అల్ట్రోజ్ ఎక్స్‌టీ డార్క్ ఎడిషన్‌లో 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. దీంతోపాటు 1.2 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఇందులో ఉండనుంది. ఈ రెండిట్లోనూ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించారు.


ఇక అల్ట్రోజ్ ఎక్స్‌జెడ్+ డార్క్ ఎడిషన్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించారు. అయితే ఈ కారు ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇందులో కూడా టాటా కొత్త ఫీచర్లను అందించింది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, బ్రేక్ స్వే కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి.