ఏపీలో ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకోసం ప్రభుత్వం బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిపింది. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి కూడా శ్రీకారం చుట్టింది. కొవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన వసతుల కల్పనకు కృషిచేశారు అధికారులు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాన్ని మెరుగుపరిచారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు ఏపీలోని ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. కావలిలోని ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న ఘటనలే దీనికి ఉదాహరణ.
ఆది నుంచీ వివాదాస్పదం..
నెల్లూరు జిల్లాలోని కావలి ఏరియా ఆస్పత్రి వ్యవహారం మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. కరోనా సమయంలో మృతదేహాలను చెత్త తరలించే ట్రాక్టర్లలో పంపించిన ఘటన ఇక్కడే జరిగింది. వెయ్యిరూపాయలిస్తేనే ఆపరేషన్ చేస్తానన్నారని గతంలో ఓ డాక్టర్ పై ఆరోపణలు కూడా వచ్చాయి. ఆస్పత్రిలో పారిOశుద్ధ్యం అంతంత మాత్రమే. ఇటీవల ఆస్పత్రి సూపరింటెండెంట్ గా మండవ వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులో కాస్త మార్పులొచ్చాయని చెబుతున్నారు.
డ్రైవర్ తో పోస్ట్ మార్టం..?
తాజాగా కావలి ఏరియా ఆస్పత్రిలో ఓ మృతదేహానికి ఆంబులెన్స్ డ్రైవర్ పోస్ట్ మార్టమ్ చేసినట్టు వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటపడ్డాయి. దీంతో మరోసారి కావలి ఆస్పత్రి వార్తల్లోకెక్కింది. డ్యూటీ డాక్టర్లు పట్టించుకోవడం లేదని, వారి ప్రోద్బలంతోనే డ్రైవర్లు పోస్ట్ మార‌్టం చేస్తున్నారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరుబయటే పోస్ట్ మార్టం చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్నారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ మండవ వివరణ..
ఈ వివాదంపై కావలి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మండవ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. ఏబీపీ దేశంతో ఫోన్ లో మాట్లాడారు. కొంతమంది కావాలని వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. వాస్తవానికి డ్యూటీ డాక్టర్ సద్దాం హుస్సేన్ అప్పటికే పోస్ట్ మార్టమ్ పూర్తి చేశారని, వార్డ్ బాయ్ రవి ఆయనకు సహాయం చేశారని, ఆంబులెన్స్ లో ఎక్కించే సమయంలో డ్రైవర్ సహాయం చేస్తున్న క్రమంలో కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారని అన్నారు. కావలి ఆస్పత్రిలో అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నట్టు వివరించారు. డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పారు.
మొత్తమ్మీద.. కావలి ఏరియా ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. డ్రైవర్ తో పోస్ట్ మార్టం చేయిస్తున్నారంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. చివరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరణతో ఇది సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.