Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణ పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా డిసెంబరు 8న మొదలైన ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు జనవరి 3 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 12 మైదానాల్లో పీఈటీ, పీఎంటీ నిర్వహిస్తున్నారు. అయితే పోలీస్ నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడంవల్ల దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు మా దృష్టికి వచ్చింది. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.’ అని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల (సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్) నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురదృష్టకరం. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరం. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్ కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయం’ అన్నారు.
‘దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8 మీటర్లుగానే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంవల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. లాంగ్ జంప్ తోపాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలి. లాంగ్ జంప్ లో ఆన్ ది లైన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకుగాను అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని కోరుతున్నాం. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం అని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ పలు విషయాలు ప్రస్తావించారు.
రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.