ఆదివారం, ఆదివారం బొమ్మిడాయిల పులుసు తీసుకొచ్చి ఇస్తే చాలు, తనపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి, వారి వెనక ఉన్న వారికి తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. నెల్లూరు సిటీలో అభివృద్ధి కుంటుపడిందని కొంత మంది జర్నలిస్టులు రాస్తున్నారని, అలాంటి వారు తన వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. తన వెనక సీఎం జగన్ ఉన్నారని చెప్పారు. పదేళ్లుగా కుమ్ముతున్నారని, పొడుస్తున్నారని అయినా భయపడేది లేదని అనిల్ కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు. తాను ఎప్పటికీ తలవంచేది లేదని చెప్పారు. ఒకరోజు బతికినా మగోడిలాగా బతకాలని సలహా ఇచ్చారు. ప్యాకేజీలు తీసుకుని వార్తలు రాసేవారికి తాను భయపడబోనని అన్నారు. 


ఏం పీక్కుంటారో పీక్కోండని అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు. ఇటీవల అయ్యప్ప మాలలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఆ సమయంలో ప్రతిపక్షాలని కానీ, మీడియాని కానీ ఎక్కడా పల్లెత్తు మాట అనలేదు. తాజాగా మాల తీసేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ డోస్ ‌లో ఘాటుగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.


గడపగడపకు..


గురువారం నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రైల్వే వీధి, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, పెద్దతోట, తదితర ప్రాంతాలలో అనీల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. 72వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి  వివరిస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు బాగుండాలని నగర నియోజకవర్గంలోని డివిజన్ లలో దాదాపు 4 వేలకు పైగా చీరలు, దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు, అలాగే 200 మందికి పైగా రక్తదానం ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.


రక్తదాన శిబిరం


రెండు రోజుల క్రితం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్ వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులతో కలిసి కోటమిట్ట నుండి గాంధీ బొమ్మ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ వున్న దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజన్న భవన్ లో ఏర్పాటు చేసిన కేకు కటింగ్ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారితో కలిసి పాల్గొని కేకు కటింగ్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.