ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ టీడీపీ ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం ఈ ఆరోపణల్ని ఒప్పుకోవడంలేదు. కానీ అధికార పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ అధికారుల సమీక్షలో కుండబద్దలు కొట్టారు. స్వపక్షంలో విపక్షంలా ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులే హడలిపోయారు. పక్కనే ఉన్న మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కూడా ఆయన్ను వారించలేని పరిస్థితి.
సాక్ష్యాధారాలతో సహా..
నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరులో మొగిలి పాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి సుమారు 150 ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పంట పొలాలు మునిగిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఎగువ ప్రాంతం నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు వదలాలో కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఫొటోలను కూడా ప్రదర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు అధికారులు ఏం సమాధానం చెబుతారని అన్నారు.
బొత్స శాఖ మారింది కానీ మా పని జరగలేదు..
మంత్రుల శాఖలు మారినా పనులు జరగడంలేదని సొంత పార్టీపైనే సెటైర్లు పేల్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గత డిసెంబర్ లోగా పనులు పూర్తి చేస్తానని మాటిచ్చారని, కానీ ఈ డిసెంబర్ కి కూడా పనులు మొదలు కాలేదని, అంతలోనే ఆయన శాఖ మారిందని, తమ పనులు మాత్రం జరగలేదన్నారు.
నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీనుంచి డైకస్ రోడ్డు వరకు.. కొత్త రోడ్డు మంజూరైనా సగం రోడ్డు వేసి వదిలేశారని, అసలు పూర్తిగా రోడ్డు వేయకుండా వదిలేసినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని. ఇదేం ఖర్మ అంటూ ఆ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని, అసలు అధికారులు ఇంత అవకతవక పనులు ఎలా చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే.
మొత్తమ్మీద అధికారుల్ని మంత్రి ముందే నిలదీశారు ఎమ్మెల్యే. ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు మరింత ఘాటుగా ఆయన మాట్లాడారు. పొట్టేపాలెం కలుజు వద్ద.. దాతల్ని బతిమిలాడుకుని చిన్న రోడ్డు వేసుకున్నామని, టీవల వర్షాలకు అది కూడా కొట్టుకుపోయిందని, కానీ ఇంతవరకు అక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ కాలేదన్నారు ఎమ్మెల్యే. అధికారుల్ని అడిగితే ఫేజ్-2 అంటున్నారని.. అసలు ఈ ఫేజ్ 1,2,3 లు ఏంటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు తెల్లమొహం వేశారు. పక్కనే మంత్రి ఉన్నారు, కానీ ఆయన ఎమ్మెల్యేకు సర్దిచెప్పలేకపోయారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మంత్రి నియోజకవర్గంలో కూడా రోడ్లు అధ్వాన్నంగానే ఉన్నాయి. రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు ఉంది వారి పరిస్థితి. అటు కలెక్టర్ సహా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే, అనుకూల మీడియా ద్వారా వారికి కౌంటర్లు ఇస్తారు కానీ, ఇప్పుడిలా సొంత పార్టీ ఎమ్మెల్యే విరుచుకుపడితే ఇక అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.