కన్నబిడ్డలు విదేశాల్లో ఉన్నా.. వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ సంతోషపడుతుంటారు తల్లిదండ్రులు. అక్కడి నుంచి వారు ఆర్థికంగా సాయం చేసినా చేయకపోయినా వారి గురించి మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. బిడ్డలు ఫారిన్ లో ఉండటం గొప్పగా భావిస్తారు తల్లిదండ్రులు. కానీ కొంతమంది మాత్రం బిడ్డలను వదిలిపెట్టి ఉండలేరు. దూరపు కొండలు నునుపు అంటూ వెళ్లి తిప్పలు పడటం ఎందుకని అంటారు. బిడ్డలు కళ్లముందే ఉండాలని కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులే నెల్లూరులో ఉన్నారు. అయితే కొడుకు మాత్రం తాను విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో చివరకు తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ విషాదంగా మారింది. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదంగా మారింది. 


నెల్లూరులోని న్యూమిలట్రీ కాలనీలోని ఆరో క్రాస్ రోడ్డులో సాయిబాబా మందిరం వద్ద చల్లా పెంచల నరసింహారెడ్డి, విజయకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సదాశివ రెడ్డి, భరత్‌ రెడ్డి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ అవివాహితులే. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. భరత్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.


ఎక్కడికీ వెళ్లొద్దు..


పెద్ద కొడుకు సదాశివరెడ్డి విదేశాలకు వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిరాకరించారు. తమ వద్దే ఉండాలని, ఇక్కడే ఉండి కుటుంబ బాధ్యతలు చేపట్టాలని వారు కొడుకుకు సూచించారు. కానీ సదాశివరెడ్డి మాత్రం వారి మాట వినలేదు. తాను విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు ససేమిరా అనడం, కొడుకు విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఆ కుటుంబంలో కలతలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇటీవల తండ్రి నరసింహారెడ్డి అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లాడు. ఈనెల 18న శబరిమలకు వెళ్లిన ఆయన త్వరలో తిరిగి రావాల్సి ఉంది. ఈలోగా ఇంట్లో ఘోరం జరిగిపోయింది. తండ్రి శబరిమల వెళ్లిన తర్వాత మరోసారి తన అభిప్రాయం వెలిబుచ్చాడు కొడుకు. తాను ఎలాగైనా విదేశాలకు వెళ్లాల్సిందేనన్నాడు. కానీ తల్లి విజయకుమారి మాత్రం ససేమిరా అంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.


ఈనెల 25న విదేశాలకు వెళ్లేందుకు పెద్ద కొడుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తమ్ముడు ఈ విషయంలో ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి తిరిగి వచ్చేలోపు కొడుకు తన మాట వినకుండా ఫారిన్ వెళ్లిపోతాడేమోనని భయపడింది తల్లి విజయకుమారి. బిడ్డను వారించినా మాట వినడని తేలిపోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కానీ కొడుకు అంత సీరియస్ గా తీసుకోలేదు. చివరకు విజయకుమారి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయింది. బుధవారం ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే కొడుకు ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వేదాయపాళెం పోలీసులకు తమ్ముడు భరత్‌ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ కు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.