జీవో 317 సవరించాలంటూ ప్రగతిభవన్​ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు. ఉపాధ్యాయుల అరెస్టును ఖండించారు. టీచర్లందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికతకు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు. సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు.


ఏమైందంటే..


జీవో 317 రద్దుపై తెలంగాణలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటి వరకు.. 70 మందికి పైగా టీచర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని.. సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. 317 జీవోతో భార్య భర్తలను విడదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉద్యోగులను మరో ప్రాంతానికి బదిలీ చేయడం అన్యాయమని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు.


'మన జీవితానికి పండగ లేదు.. మనం పరాయి జిల్లాలో జీవితాంతం బతకలేము. ఋణమో పనమో కొట్లాడాలి. భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే కంటే చావటం నయం. అడగనిదే అమ్మయిన పెట్టదు ఈ ప్రభుత్వం పెట్టె స్థాయిలో లేదు. దయచేసి ఆలోచించండి.. పోరాటానికి సిద్ధం కండి. నీకోసం నీ పిల్లల భవిషత్తు కోసం.. ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధం కండి. రండి.. కదలి రండి.. భయం నుండి, బానిస సంకెళ్లను తెంచుకుని రండి. సీనియారిటీ వద్దు, స్థానికతే ముద్దు.' అంటూ పలువురు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.


జీవో నెంబర్ 317 ప్రకారం.. 
ఈ జీవో ప్రకారం ఉద్యోగుల ఆప్షన్ ఫామ్ లను  సీనియారిటీ ఆధారంగా పరిశీలిస్తారు. తర్వాత జిల్లాలలో ఉన్న సీనియారిటీ జాబితా ప్రకారం వారు ఇచ్చిన మొదటి ప్రాధాన్యత జిల్లాను వారికి కేటాయింపు చేస్తారు. ఆ సీనియారిటీ జాబితాలో మొదటగా preferncial categoryలో వున్న వారికి మొదటి ప్రాధన్యత ప్రకారం సీనియారిటీ తో సంబంధం లేకుండా మొదట వారికే ఉంటుంది. జిల్లా  working cadre strength ప్రకారం SC, STలను వారి నిష్పత్తి ప్రకారం కేటాయింపులు ఉంటాయి.