Baby born on TGSRTC bus gets free lifetime pass | హైదరాబాద్: రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు #TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకుంది. ఈ మేరకు ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ (Lifetime Free Bus Pass) ను  మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే, కండ‌క్ట‌ర్‌తో పాటు గ‌ర్భిణి డెలివ‌రీకి సాయం చేసిన వ‌న‌ప‌ర్తిలోని మ‌ద‌ర్ అండ్ చైల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ స్టాఫ్ న‌ర్స్ అలివేలు మంగ‌మ్మకు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్ర‌యాణించే బ‌స్ పాస్‌ను ఆర్టీసీ అందించింది. 


కండక్టర్, డ్రైవర్, నర్సులను అభినందించిన ఆర్టీసీ


బ‌స్సులో ప్ర‌యాణిస్తున్నప్పుడు పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్బిణికి కాన్పు చేసిన గ‌ద్వాల్ డిపోన‌కు చెందిన కండ‌క్ట‌ర్ భార‌తి, డ్రైవ‌ర్ అంజిల‌తో పాటు న‌ర్సు అలివేలు మంగ‌మ్మ‌ను మంగ‌ళ‌వారం టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించి.. న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్ర‌యాణించే బ‌స్ పాస్‌ను న‌ర్సు అలివేలు మంగ‌మ్మ‌కు, చిన్నారి ఉచిత బ‌స్ పాస్‌ను గ‌ద్వాల డిపో మేనేజ‌ర్ ముర‌ళీకృష్ణ‌కు అంద‌జేశారు. 


రాఖీ కట్టేందుకు వెళ్తుంటే పురిటి నొప్పులు


గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో రాఖీ పండుగ రోజున సోమవారం (ఆగస్టు 19న) ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు అలివేలు మంగ‌మ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 


సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన కండ‌క్ట‌ర్ భార‌తి, న‌ర్సు అలివేలు మంగ‌మ్మ, డ్రైవ‌ర్ అంజి సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (VC Sajjanar) మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి, డిప్యూటీ సీటీఎం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. 


Also Read: Telangana: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకో- మంత్రి పొన్నం ప్రభాకర్