Indigo charging Rs 50 as cute charge : రెండు పాలప్యాకెట్లు ఉన్నాయి కదా సార్ చెరో ఒకటి తీసుకుంటే సరిపోయేదిగా ... అని అమాయకంగా పవన్ కల్యాణ్ ని అడుగుతాడు.. జల్సా సినిమాలో బ్రహ్మానందం. ఎందుకంటే.. రెండు పాల ప్యాకెట్లను కట్ చేసి.. దోసిళ్లలో సగం సగం పోస్తాడు మరి. ఈ ఐడియా అప్పుడే తెలిసినట్లుగా పవన్ కల్యాణ్ బ్రాహ్మానందాన్ని క్యూట్ అని పొగుడుతాడు.
ఇప్పుడు తమ ప్రయాణికుల్ని కూాడా ఇండిగో విమాన యాన సంస్థ క్యూట్‌గా ట్రీట్ చేస్తోంది. మీరు చాలా క్యూట్ అంటూ చార్జీలు వసూలు చేసేస్తోంది. ఒక్కో టిక్కెట్‌పై యాభై రూపాయలు వసూలు చేస్తోంది. యాభై రూపాయలు పోతే పోయాయి కానీ.. క్యూట్ గా ఉన్నారని ఇండిగో సర్టిఫికెట్ ఇస్తోందని చాలా మంది సైలెంట్ గానే ఉన్నారు కానీ.. బెంగళూరుకు చెందిన ఓ లాయర్ మాత్రం.. నేను క్యూట్ గా ఉంటానో.. ఇంకెలా ఉంటానో.. అదింతా నా ఇష్టం.. నేనెందుకు డబ్బులు కట్టాలని ఫైరయ్యారు. టిక్కెట్ తీసి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేశారు.
బెంగళూరు లాయర్ ట్వీట్ ఒక్క సారిగా వైరల్ అయింది. అందరూ రకరకాల జోకులేశారు.
తమ క్యూట్ నెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని తెలియగానే.. ఇండిగో కూడా స్పందించింది. క్యూట్ చార్జీలు అంటే అందంగా ఉన్నందుకు కాదని.. ఎయిర్ పోర్టులో సౌకర్యాలు కల్పిస్తున్నందని వివరణ ఇచ్చింది.
అయితే ఇలా ప్రతీ దానికి ఎప్పట్నుంచి విడివిడిగా చార్జీలు వసూలు చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇదో అంతులేని కథ. మొత్తంగా క్యూట్ చార్జీల పేరుతో ఇండిగో చేస్తున్న చార్జీల వసూళ్లు మాత్రం వైరల్ అయ్యాయి.