South Central Railway: ఆ రైల్వే ట్రాక్‌లో వెళ్లే రైళ్లలో చోరీలు జరుగుతాయి. యాథృచ్ఛికంగా జరుగుతున్నాయా పక్క ప్రణాళికాతో జరుగుతున్నాయా అన్న అంశంపై క్లారిటీ లేదు. చోరీ గ్యాంగ్ ఆ ప్రాంతంలోనే దోపిడికి తెగబడటానికి ప్రత్యేక కారణాలు ఏంటి. రైల్వే, లోకల్ పోలీసులు ఇక్కడ చోరీ జరగకుండా చూడటంలో ఎందుకు విఫలమౌతున్నారు? వరుసగా చోరీలు జరుగుతూ ఉంటే రైల్వేపై ప్రయాణికలకు నమ్మకం పోదా భద్రతా వైఫల్యానికి కారణాలు ఏమిటి.?
దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన ట్రాక్ హైదరాబాద్ టూ చెన్నై వయా నడికుడి. అత్యంత రద్దీ అయిన ట్రాక్. ప్రతిరోజు వందల పాసింజర్, గూడ్స్ రైళ్ళు ప్రయాణికులను, సరకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇంత రద్దీ రైల్వే లైన్ అయినా ఇంకా సింగిల్ ట్రాక్ కావడంతో లోడ్ పడుతుంది. డబల్ ట్రాక్ చేస్తామని చెబుతున్నా ఇంత వరకు కార్యాచరణకు నోచుకోలేదు. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు సింగిల్ ట్రాక్ ఉండటంతో రెండు రైళ్ళు క్రాస్ కావాలంటే ఒక రైల్‌ను నిలిపివేసి మరో బండిని పంపుతున్నారు. ఇదే చోరీ గ్యాంగ్‌లకు మంచి అవకాశంగా మారుతోంది.
చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు తుమ్మల చెరువు సిగ్నల్ వద్ద అర్ధరాత్రి 2.30గంటలకు ఆగింది. రైలు తిరిగి బయల్దేరగానే చైన్ లాగారు. సరి చేసి బయల్దేరే టైంలో మళ్లీ చైన్ లాగారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది రైల్వే కోచ్‌ల తలుపులు మూసివేశారు. సరిగ్గా అదే టైంలో నలుగురైదుగురు దొంగలు ఎస్4, ఎస్8, ఎస్10, ఎస్12 కోచ్‌ల్లో విండో సీట్లో కూర్చున్న వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్లిపోయారు.
సరిగ్గా ఈ ఘటన జరిగిన కొద్దీ దూరంలోని డెల్టా ఎక్స్ ప్రెస్‌లోని ఎస్ 9 కోచ్‌లో దొంగలు పడ్డారు. బంగారు ఆభరణాలు లాక్కెళ్లిపోయారు. ఒకే టైంలో రెండు ఘటనలు జరగడంతో గుంటూరు డివిజన్ నుంచి పోలీస్ బలగాలు వెళ్లి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
ఈ రెండు ఘటనలు జరిగి 24 గంటలు కాకముందే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీకి యత్నించారు. రాత్రి 1.30 గంటల సమయంలో నడికుడి వద్ద ట్రెయిన్ చెయిన్ లాగి నిలిపి వేశారు. అప్పటికే ట్రెయిన్ కోచ్‌ల్లోని డోర్స్, విండోలు క్లోజ్ చేయడంతో చోరీకి వీలులేకుండా పోయింది. ఈ కోపంతో రైలుపై రాళ్లు రువ్వారు. తెరుకున్న సిబ్బంది వెంటనే ట్రైన్‌ను అక్కడ నుంచి పోనిచ్చారు. బంగారు ఆభరణాలు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
ఇలా 24 గంటల వ్యవధిలో మూడు రైళ్లలో చోరీలు జరగటంతో రైల్వే అధికారులు కంగుతిన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భద్రతలో సిబ్బంది బిజిగా ఉంటారు రైళ్లలో సెక్యూరిటీ తక్కువుగా ఉంటారనే ఇలా చేశారని అంటున్నారు. నల్గొండ నుంచి పిడుగురాళ్ల వరకు ట్రాక్ పై స్టేవన్లు దూరంగా ఉంటాయి. ఇక్కడ రాత్రి వేళలో క్రాసింగ్స్ కోసం ట్రైన్ ఆగినప్పుడు చోరీలు చేసి తప్పించుకోవడం సులువుగా ఉంటుంది. ట్రైన్ ట్రాక్ హైట్‌గా ఉండటం వల్ల పట్టుబడే ప్రసక్తి ఉండదన్న ధీమా కూడా ఉండొచ్చు. గతంలో ప్రతి రైలు బోగీకి ఒక సీఆర్పీఎఫ్ గార్డ్ ఉండే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెచ్చి పోతున్నారు దొంగలు.