ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పదకొండో తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకుంది. మామూలుగా అయితే రాజకీయ పార్టీలు సహజంగా ధర్నాలు అంటే జంతర్ మంతర్‌లో చేస్తాయి. కానీ తెలంగాణ భవన్‌లోనే చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాట్ల‌ను ఎంపీలు సంతోష్ కుమార్ , రంజిత్ , ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి చూసుకుంటున్నారు.  ధ‌ర్నాకు 1500 మంది వ‌ర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రయ్యేలా చూడనున్నారు.  టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ ఢిల్లీ రావాలని సందేశాలు పంపించారు. 


గవర్నర్ గతాన్ని మర్చిపోకండి - తమిళి సై వక్ర బుద్ధితో మాట్లాడారు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లతో పాటు జాతీయ నేతల్ని పిలిచే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా రైతు సంఘాల నేతలను పిలుస్తున్నారు. రాకేష్ టికాయత్ వంటి నేతలను ఆహ్వానించారు . పెద్ద జాతీయ నేతలు వస్తారని క్లారిటీ వస్తే కేసీఆర్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన తిరిగి వస్తారన్నసమాచారం ఏమీ లేదు. ధర్నా వరకూ ఢిల్లీలోనే ఉంటారని  భావిస్తున్నారు.  వ‌రి ధాన్యం సేక‌రించేంత వ‌ర‌కు కేంద్రంపై పోరాటం కొన‌సాగుతోంద‌ని ఢిల్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ రైతులు 300 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించార‌ని  కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌నే తెలంగాణ రైతుల ప‌ట్ల క‌క్ష‌పూరితంగా ప్ర‌వ‌ర్తిస్తోందని విమర్శించారు. 


మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఎగిరిన నల్ల జెండా - తెలంగాణ ప్రభుత్వం అజెండా అదే !


పంజాబ్, హ‌ర్యానాలో ధాన్యం సేక‌రించిన మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ధ‌ర్నా చేస్తున్నామ‌ని తెలిపారు. కేంద్రం ధాన్యం సేక‌రించాల‌నే డిమాండ్‌తో ఇప్ప‌టికే ప్ర‌తి గ్రామం, మండ‌లం, జిల్లా కేంద్రాల్లో ధ‌ర్నాలు చేశామ‌ని గుర్తు చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేక‌రించ‌క‌పోతే త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. తెలంగాణ త‌డాఖా, ద‌మ్ము చూపిస్తామ‌ని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు.


తెలంగాణ భవన్‌లో భారీ స్టేజ్..ఎండ వేడిని తట్టుకునేలా టెంట్ ఏర్పాటుచేస్తున్నారు . దేశ రైతాంగానికి మద్దతుగా గొంతెత్తే నాయకులంటూ కేసీఆర్,కేటీఆర్ ఫ్లెక్సీలు పెట్టారు.  మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపిలు, జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇందులో పాల్గొంటారు. ఈ ధర్నాలో పలు జాతీయ రైతు సంఘాల నేతలు,వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొంటారు.