Governor Vs TRS Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేది అనే విధంగా తన పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన తర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చవిచూశారో మనందరికీ తెలిసిందేనన్నారు. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహన్ గౌరవప్రదంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను అంతే గౌరవించిందని పేర్కొన్నారు. గవర్నర్ తమిళి సై తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పడం అర్ధరహితమని, ఎక్కడ ఎవరు ఎలా అవమానించారో చెప్పాలన్నారు. యాదాద్రి పర్యటనకు 20 నిమిషాల ముందే రాజ్ భవన్ నుంచి సమాచారం అందిందన్నారు. అయినప్పటికీ యదగిరిగుట్ట చైర్మన్ గవర్నర్ తమిళి సైకి స్వాగతం పలికారన్నారు. గతంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా పని చేసిన తమిళి సై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
గవర్నర్ చరిత్ర మర్చిపోకూడదు
"గవర్నర్ తమిళి సై దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసిన తర్వాత వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు. ఒక మహిళా గవర్నర్ ను అవమానపరిచారని ఆరోపిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ అసెంబ్లీని రద్దు చేసేదానిని అన్నారు. గవర్నర్ చరిత్ర మర్చిపోకూడదు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై అప్పటి గవర్నర్ రాంలాల్ చేసిన పనికి ప్రజాగ్రహానికి గురయ్యారన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు. ఆయనను ప్రభుత్వం కూడా అంతే మర్యాదగా చూసుకుంది. ప్రొటోకాల్ పాటించాలంటే కొన్ని గంటల ముందు చెప్పాలి. గతంలో గవర్నర్ పదవులకు ఐపీఎస్, ఐఏఎస్, ఉన్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తులను నియమించేవారు. కానీ బీజేపీ వచ్చాక ఆ పార్టీ నేతలను నియమిస్తున్నారు. తమిళి సై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతను నిర్వహించారు. గవర్నర్ కు రాజ్యాంగ పరంగా ఉన్న గౌరవం ఇస్తాం. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి" అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనను తీవ్రంగా అవమానిస్తోందని కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని తమిళి సై ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు. అమిత్ షాతో ఏం చర్చించారో బయటకు చెప్పలేనని మీడియాతో గవర్నర్ చెప్పినప్పటికీ తర్వాత కొన్ని విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి. తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్ పూర్తి స్థాయి నివేదికను అమిత్ షాకు అందించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో సెలక్టివ్‌గా దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పిల్లలకు చాలా ప్రమాదకరమైనవని.. ఓ తల్లిగా బాధపడుతూ ఈ విషయం చెబుతున్నానన్నారు. అలాగే తెలంగాణలో అవినీతి ఇతర అంశాలను కూడా నివేదికలో గవర్నర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.