Telangana Formation Day Live Updates: మాచర్ల సెబ్ కార్యాలయంపై మహిళలు దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
పల్నాడు జిల్లా మాచర్ల సెబ్ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. సారాయి కేసులో ఉప్పుతోల రాజు అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజును అన్యాయంగా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. సెబ్ కార్యాలంయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. రాజు భార్య జ్యోతి చంటి బిడ్డతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఏపీ సీఎం జగన్ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న సీఎం జగన్, కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ అవ్వనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ పసిపాప ప్రాణం పోగట్టుకుంది. నొప్పులు వస్తున్నాయని చెప్పినా.. డెలవరీకి టైం ఉందంటూ పంపించేశారు. దీంతో ఆమె బాత్‌రూమ్‌లో డెలవరీ అయింది.
వీర్నపల్లి మండలానికి చెందిన మాధవి అనే మహిళ పురిటి నొప్పులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు డెలవరీకి ఇంకా ఇంకా 20 రోజుల టైమ్ ఉందంటూ తిరిగి పంపించేశారు. నొప్పులు రావడంతో మళ్లీ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది మాధవి. అయినా వైద్యులు ఆమెను మరోసారి పరీక్షించి డెలవరీకి టైం ఉందని పాత మాటే మళ్లీ చెప్పారు.
అదే నొప్పులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయింది మాధవి. ఇలా రెండు రోజుల పాటు ప్రభుత్వాసుపత్రి చుట్టూ తిరిగినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఈ ఉదయం ఇంట్లో బాత్ రూమ్‌లోనే మాధవి డెలివరీ అయింది. పాప కింద పడి చనిపోయింది.
రెండు రోజులపాటు గర్భిణీ మాధవి ప్రభుత్వాసుపత్రి చుట్టూ తిరిగినా డాక్టర్‌లు గానీ, ఇతర సిబ్బంది పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాధవి ఫ్యామిలీ మెంబర్స్. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ దూరమైందని ఆ తల్లిదండ్రులు బోరుమంటున్నారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ... ఇంకో 20 రోజులు డెలివరీ టైం ఉన్నందున ఇంటికి పంపించివేసామని తమ తప్పేం లేదని వివరణ.
‘‘తెలంగాణ పోరాట నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు. గడిచిన ఎనిమిదేళ్ళలో 1 లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నం. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపటం ద్వారా తెలంగాణ యావద్దేశానికి ఆదర్శంగా నిలిచింది.
ప్రభుత్వం ఉద్యోగార్థుల వయోపరిమితిపై 10 సంవత్సరాలు సడలింపు నిచ్చింది. ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది. అదే విధంగా బి.సి. స్టడీ సర్కిళ్ళలోనూ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘‘ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురయిన దుస్థితి మనకు తెలుసు. వీరంతా మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ కూడా రాశాను. మన రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశాను. కానీ, కేంద్రం నుంచి దీనికి ప్రతిస్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదం. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తుంది.’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు. తెలంగాణలో ఐ.టి.ఐ.ఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐ.టి రంగం మరింతగా పురోగమించి ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి వుండేవి’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని నాతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసినం. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సానుకూలంగా జవాబు రాలేదు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడిండు. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా?
దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి. లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాను. కేంద్రం మొండి చెయ్యి చూపినా మన రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం విద్యుక్త ధర్మంగా భావించి, రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తున్నాను.’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకుంది.
కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తుంది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం.
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయింది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
‘‘2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తుంది.
తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1 లక్ష 49 వేల 848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం శుభ పరిణామం.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘‘దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది. ప్రతీ విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం.
ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటి రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం.
అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం.’’ అని కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎనలేని ఘనత సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. పటిష్ఠమైన ఆర్థిక క్రమ శిక్షణతో మెరుగైన ఆర్థిక పెరుగుదల చూస్తున్నామని అన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కరోనా సంక్షోభం నుంచి తెలంగాణ త్వరగా కోలుకుందని భారత ఆర్థిక సర్వే గుర్తించిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఆదాయం ప్రకారం ప్రతి పైసా ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చు చేస్తోందని అన్నారు.
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు గానూ రాజకీయంగా ఎంత నష్టం ఎదురైనా వెనకాడకుండా ఆ నాడు సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఎంతగానో నష్టపోతున్నారని అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సాయం అందడం లేదని అన్నారు. కేసీఆర్ పైన ఎలాంటి విశ్వాసం పెట్టుకొని ప్రజలు అవకాశం ఇచ్చారో అది నిలబెట్టుకోవడం లేదని అన్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలన అవసరమా అని ప్రశ్నించారు. గులాబీ తెగులు వదిలించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో జరిగాయి. మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత శాసనసభ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎల్.రమణ, దండే విఠల్, శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి చార్యులు, టీఆర్‌ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Background
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని మరికొన్ని భాగాలు.. మొత్తం ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్, తూర్పు బంగాళాకాతంలోని చాలా ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు మీదుగా ఈ రుతుపవనాలు విస్తరించాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
ఈ ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శీతల గాలులు వీయనున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా గాలులు వీయనున్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ గాలుల వేగం కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలో వాతావరణం ఇలా..
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుందని, నగరంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంటుందని చెప్పారు. కనిష్ఠ గరిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 38 డిగ్రీలుగా ఉంటుందని చెప్పారు. గాలులు గంటకు 10 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో ఉంటుందని ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు తగ్గింది. గ్రాముకు నేడు రూ.25 తగ్గింది ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.500 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,820 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు కాస్త తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -