AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 May 2022 07:48 PM
Vijayawada క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను దర్శించుకున్న ఎఫ్ 3 మూవీ యూనిట్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను దర్శించుకున్నారు. ఎఫ్ త్రీ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడకు వచ్చింది. ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. అమ్మ వారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఎఫ్ 3 మూవీ యూనిట్ సభ్యులకు ఆల‌య అధికారులు అందజేశారు.

MLC Ananta Babu Suspension: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సుబ్రహ్మణ్యంను తన వెంట తీసుకుని వెళ్లిన ఎమ్మెల్సీ ఆపై గొడవ జరగడంతో నెట్టియగా డ్రైవర్ చనిపోయాడని పోలీసుల విచారణలో అంగీకరించారు. ఎమ్మెల్సీ హత్య చేయడంతో సామాన్యులకు ప్రభుత్వంలో ఎలాంటి రక్షణ ఉంటుందని కాకినాడ జిల్లాలో మూడు రోజులపాటు ఆందోళన నిర్వహించారు. 

Yasin Malik Case Verdict: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు

Yasin Malik: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. యాసిన్ మాలిక్ కు మరణ శిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డిమాండ్‌ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంతోపాటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించిన కేసుల్లో యాసిన్‌ మాలిక్‌ను దోషిగా దిల్లీ కోర్టు గత వారం నిర్ధరించింది. 

Nandyala Districtలో వైఎస్సార్‌సీపీ ఉప సర్పంచ్ దాష్టీకం, హుండీపై చేతివాటం

నంద్యాల జిల్లా లోని ఓ ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో వైసీపీ ఉప సర్పంచ్ దాష్టీకానికి పాల్పడ్డారు. హుండీ లెక్కిస్తుండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేయగా దాడికి దిగారు. ఉప సర్పంచ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆలయ సిబ్బందిపై దాడిచేసి ముగ్గుర్ని గాయపరిచినట్లు సమాచారం. 

Stone Pelting At SP Vehicle: తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై కొందరు ఆందోళనకారులు రావులపాలెం రింగ్​రోడ్ వద్ద రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటపడటంతో ఆందోళనకారులు పరారయ్యారు.

YS Jagan In Davos Tour: యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో ఏపీ సీఎం జగన్ భేటీ

దావోస్‌: యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్‌ ఆత్రేయ, బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ పబ్లిక్‌పాలసీ సుష్మిత్‌ సర్కార్, కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్, ఈజీమై ట్రిప్‌ ప్రశాంత్‌పిట్టి, వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, కొర్‌సెరా వైస్‌ ప్రెశిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌ ఉన్నారు.

నిజామాబాద్ జిల్లాలో జాలర్ల వలకు చిక్కిన భారీ మొసలి, గ్రామస్తుల భయాందోళన

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సపూర్ గ్రామంలో జాలర్ల వలలో భారీ మొసలి చిక్కింది. గత పది రోజులుగా తమ ఊరి చెరువులో భారీ మొసళ్ళు కనబడుతున్నాయంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాలర్ల వలలో చిక్కిన భారీ మోసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు జాలర్లు.

No Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు బ్యాడ్ న్యూస్.. ఈఏడాది కూడా చేప ప్రసాదం నిలిపివేత

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ ఏడాది సైతం చేప మందు పంపిణీ చేయడం లేదు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ తెలిపారు. కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ వస్తుంది.

Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు ఘన స్వాగతం పలకాలని మంత్రి ఆదేశాలు

తెలంగాణ ఆణిముత్యం  నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ విజేత గా గెలుపొంది తొలిసారిగా  తొలిసారిగా ఈనెల 27న సాయంత్రం సుమారు 6 గంటలకు  రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఘన స్వాగతం పలకాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. 


ఇటీవల టర్కీ లోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 KG ల విభాగంలో మన రాష్ట్రానికి చెందిన దేశం గర్వించదగ్గ యువ బాక్సర్ కుమారి నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన బాక్సింగ్ ఆణిముత్యం కుమారి నిఖత్ జరీన్ కు , అలాగే సికింద్రాబాద్ కు చెందిన ఇషా సింగ్ జర్మనీ లో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రానికి వస్తున్న వీరికి ఘన స్వాగతం పలకాలని మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాను, సాంస్కృతిక శాఖ సంచాలకులను, క్రీడా శాఖ అధికారులకు, క్రీడా పాఠశాల అధికారులను ఆదేశించారు.

Pawan Kalyan on SC ST SC Atrocity: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీనే: పవన్ కళ్యాణ్

మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నిందితులను శిక్షించడం, బాధితులకు అండగా నిలబడేందుకు బదులుగా ఏపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. అత్యాచారం జరిగిన మహిళకు అండగా నిలవకుండా, తల్లుల పెంపకం బాగోలేకపోతే ఇలా జరుగుతాయని హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలన్ని ఈ సందర్భంగా జనసేనాని గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. పలమనేరులో టెన్త్ విద్యార్థినిపై వేధింపులు జరిగితే ఆత్మహత్య చేసుకుంది. 


విశాఖపట్నంలో ఓ అధికారిని వైఎస్సార్‌సీపీ నేతలు కొట్టినా అధికారిదే తప్పు అంట. వీరికి వ్యతిరేకంగా తీర్పు వస్తే న్యాయమూర్తులు, జడ్జీలదే తప్పు అని విమర్శలు చేస్తారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే, మానసికంగా చిద్రవధ చేసి ఆయన చనిపోయేలా చేశారు. మత్స్యపురిలో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి సర్పంచ్‌గా గెలిచిన జనసేన మహిళా నేత ఇంటిపై దాడి చేసి వైసీపీ నేతలు కూల్చేశారు. 


కేంద్ర మంత్రి రాంనాథ్ అథవాలేను బీఎస్పీ నేతలు అడిగిన ప్రశ్నకు.. దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపులు అధికంగా జరిగిన రాష్ట్రం ఏపీ అని సమాధాన మిచ్చారు. 5,857 దుర్ఘటనలు ఎస్సీ, ఎస్టీలపై జరిగాయన్నారు. వరప్రసాద్ అనే దళిత యువకుడికి వైసీసీ నేతలు శిరోముండనం చేయించారని, తాను ఈ సమాజంలో బతకలేనని నక్సలైట్ గా బతికేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు లేఖ పెట్టారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Pawan Kalyan On Konaseema Issue: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేసింది: పవన్ కల్యాణ్

తూర్పు గోదావరి జిల్లాను మూడుగా విభజిస్తూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేశారని, తాను గమనించింది ఏంటంటే.. అన్ని జిల్లాలకు ఒక విధానం... కోనసీమకు ఒక విధానం తీసుకొచ్చారని జనసేన అధ్యక్షు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘‘మిగతా జిల్లాల మాదిరిగానే అదే రోజున చేసి ఉంటే బాగుండేది.. కావాలని జాప్యం చేయడం వెనుక ఉన్న ఉద్దేశమేంటో అర్థం కావడం లేదు. జిల్లాకు మహానాయకుల పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా అభినందించదగ్గదే’’నని అన్నారు.


‘‘కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని సూచించారు. అంటే గొడవలు పెట్టాలని ఇలా చేశారా? మిగతా జిల్లాకు అలాంటి వెసులుబాటు కల్పించలేదెందుకు. అంటే గొడవలు పెట్టాలనే వైసీపీ ప్రభుత్వ విధానంగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఆ అభ్యంతరాలు కూడా సామూహికంగా కాదు వ్యక్తులుగా రావాలని సూచించారు. అది కూడా కలెక్టరేట్ కు వచ్చి చెప్పాలన్నారు. ఇలా పెట్టడంలో కూడా వ్యక్తులను టార్గెట్ చేయడమే వాళ్ల ప్రధాన ఉద్దేశంగా జనసేన భావిస్తోంది. ఓ సోషల్ మీడియా పోస్టు పెడితే నానా హంగామా చేస్తున్న ప్రభుత్వం... 30 రోజులు టైం ఇచ్చారు అంటే.. గొడవలను ప్రోత్సహించినట్టు అర్థం చేసుకోవచ్చు. మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే యంత్రాంగాలన్నీ ప్రేక్షక పాత్ర వహిస్తూ చూశారు. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే నేను వెళ్తున్నాను అంటే... 144 సెక్షన్ విధించి అలెర్ట్‌గా ఉన్నారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారు. ఇదంతా ప్రీప్లాన్డ్‌ గా జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు. మంత్రి ఇంటివైపు వెళ్తుంటే ఎందుకు ఏం చేయకుండా ఉండిపోయారు. గతంలో కూడా ఇలాంటి విధ్వంసాలు చేయడం వైసీపీకి తెలిసిన అంశమే. ఇక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఒక్క సంఘటనే అంటే సరిపెట్టుకోవచ్చు. మూడు రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వాళ్ల డ్రైవర్‌ శవాన్ని తీసుకొచ్చి ఫ్యామిలీకి అప్పగించి... ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్సీ చంపినట్టు ఒప్పుకున్నారు. వీటన్నింటిని కవర్ చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం రేపిందని స్పష్టమవుతోంది.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

Kamareddy: కామారెడ్డి జిల్లాలో వడ్ల కుప్పపై రైతు మృతి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామ పంచాయతీ పరిధి బంజర్ల శివారులో ధాన్యం కుప్ప వద్ద రైతు గుండెపోటుతో మృతిచెందాడు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన గుడిసె సిద్దరాములు (43) రాత్రి ధాన్యం కుప్ప వద్దకి కావలిగా వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున స్థానికులు పరిశీలించగా విగతజీవిగా పడిఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Rajyasabha: 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి వైసీపీ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు YSRCP Candidates నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

Amalapuram News: ఇది ఆంధ్రానా? పాకిస్థానా?: జీవీఎల్

కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఏపీలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేడ్కర్‌ మీద అంతగా చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా కదా అని ప్రశ్నించారు. బుధవారం జీవీఎల్ నరసింహారావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్లు, హింసకు బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టవద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

PM Modi Hyderabad Tour: ప్రధాని రాక సందర్భంగా సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు


లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్సీయూ డిపో వద్ద లెఫ్ట్ తీసుకొని మసీద్ బండ కమాన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసు కొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది.


విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసు కొని హెచ్సీయూ బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.


విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో. జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్రామ్ గూడ రోటరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని ఓఆర్ఆర్ రోడ్డు, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు.


కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్-45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్కు చేరుకోవచ్చు.


గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, హెచ్సీయూ డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.

Amalapuram: 46 మందిని అదుపులోకి : డీఐజీ ప్రకటన

అమలాపురంలో అమలవుతున్న కర్ఫ్యూ ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పందించారు. ‘‘వేరే జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకురావటమే లక్ష్యం. సీసీ ఫుటజ్ లు పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకూ 46మందిని అదుపులోకి తీసుకున్నాం. వారిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టాం. పేరు మార్పు అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులతో మాట్లాడాం. వాళ్ళు తమ తరపు నుంచి శాంతిపూర్వక హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షలు ఉన్నాయి అందుకే కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టడం లేదు. కానీ అన్ని చోట్ల పోలీసు నిఘా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని అన్నారు.

నిజామాబాద్ నుంచి కాశీకి యాత్రికుల బస్సు, బిహార్‌లో బోల్తా

నిజామాబాద్ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బిహార్‌లో ప్రమాదానికి గురైంది. ఔరంగాబాద్‌ జిల్లాలో ఈ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తా పడి నిజామాబాద్‌ జిల్లా వెల్మల్‌కు చెందిన సరళమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఔరంగాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం 38 మంది యాత్రికులతో నిజామాబాద్‌ నుంచి ట్రావెల్స్‌ బస్సు కాశీ యాత్రకు బయలుదేరింది. ఔరంగాబాద్‌లో ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. బస్సులో వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్‌తో పాటు బాసరకు చెందిన యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Background

నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అదే సమయంలో బలమైన వేడి గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా బలమైన వేడిగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతంలో వేడిగాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక లేదు. నేడు ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక వేడి గాలులకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు పెరిగింది. గ్రాముకు ఏకంగా రూ.60 చొప్పున పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,090 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.66,100 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,100 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.