Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 May 2022 06:56 PM
Amalapuram Live: కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఉద్యమం

Konaseema District: ఆ పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదు- మార్చే ఉద్దేశం లేదు: సజ్జల

కోనసీమలో జరుగుతున్న దాడిపై ప్రభుత్వం రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. జిల్లా పేరు మార్చే ఉద్దేశం లేదన్న ఆయన... డిమాండ్స్‌ ఏంటో చెప్పాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాల కుట్ర చేస్తున్నట్టు అర్థమవుతుందని అభిప్రాయపడ్డారాయన. 

CCS Row In AP: సీపీఎస్ పునరుద్ధరణ సాధ్యం కాదు, జీపీఎస్‌కు సహకరించండి: ఉద్యోగులకు ప్రభుత్వం సూచన

సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసాయి.. పాత పింఛన్‌ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ తెగేసి చెప్పేసింది. న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడ‌ మంత్రులు వెల్ల‌డించారు. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు నచ్చజెప్పాలని ఉద్యోగ నేతలకు మంత్రులు సూచించారు.
జీపీఎస్ పై తమ అభిప్రాయాలు గురించి,6 సంఘాల నేతలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా చెప్పారు. జీపీఎస్‌లో సీపీఎస్‌లోని అవలక్షణాలన్నీ ఉన్నాయ‌ని ఉద్యోగ సంఘాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో 4 లక్షల ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తెచ్చారని ఉద్యోగ సంఘాలు వెల్ల‌డించాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్‌లో పెట్టిన డబ్బులు రావని ప్రభుత్వ సలహాదారు సజ్జల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దీని పై కూడా ఉద్యోగులు అసంతృప్తినివ్య‌క్తం చేశారు. ఎప్పటికైనా ఆ మొత్తం ఉద్యోగులదేనని ఉద్యోగ సంఘాలు కూడ దీటుగానే స్పష్టం చేశాయి. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని కూడ ఉద్యోగ సంఘాలు వివ‌రించేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది.. వాటిని క‌నీసం ప‌ట్టించుకొని మంత్రుల క‌మిటి జీపీఎస్ పైనే మాట్లాడాల‌ని ఉద్యోగుల‌కు సూచించారు.అంతే కాదు జీపీఎస్ లో  ఇంకా ఏం కావాలో మాత్రమే చెప్పాల‌ని క్లారిటి అడిగింది, మంత్రుల కమిటీ

Kamareddy: కాంగ్రెస్ రచ్చబండలో రచ్చ రచ్చ

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు బజారుకెక్కాయి. ఇప్పటికే ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఇద్దరు నేతలకు సంబంధించిన వర్గీయులు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఒకేచోట తారసపడటంతో.. మాటామాటా పెరిగి బాహాబాహీకి దిగారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్ సుభాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ విభేదాలు కాస్త ఇవాళ బజారుకెక్కి ఘర్షణకు దారితీశాయి. లింగంపేట్ మండలం కోమట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాయకులు మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణతో కోమట్ పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను పంపించేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు లింగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Punjab Health Minister: కేబినెట్ నుంచి పంజాబ్ ఆరోగ్య మంత్రికి ఉద్వాసన

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిపై కన్నెర్ర చేశారు. ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో భగవంత్ మాన్ సింగ్ ఆయనకు ఉద్వాసన పలికారు. కాంట్రాక్టుల విషయంలో విజయ్ సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు స్పష్టమైన ఆధారాలు సేకరించిన మీదట ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లుగా పంజాబ్ సీఎంవో వెల్లడించింది.

Rajyasabha Notification: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవికాలం యుగియనుంంది. వారిస్థానాల్లో కొత్తవారి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి మే 31 తేదీ వరకు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంటుంది. జూన్ ఒకటో తేదీన రాజ్యసభ స్థానాల నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూన్‌ మూడో తేదీతో ముగియనుంది. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. 

Warangal: సిటీ స్కాన్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో రూ.2.14 కోట్ల విలువైన కొత్త సిటీ స్కాన్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌తో కలిసి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ స్కాన్‌ మిషన్‌ పనితీరు తదితర వివరాలపై సూపరింటెండెంట్‌, టెక్నీషియన్స్‌ను అడిగి తెలుసుకున్నారు.

Begum Bazar Honor Murder: మృతుడి కుటుంబ సభ్యుల శాంతి ర్యాలీ

* బేగం బజార్ పరువు హత్యపై కుటుంబ సభ్యుల పీస్ క్యాండిల్ లైట్ ర్యాలీ


* మృతుడు నీరజ్ ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ 


* ర్యాలీలో పాల్గొన్న నీరజ్ సతీమణి సంజన, కుటుంబ సభ్యులు, మార్వాడి సమాజ్


* ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి బాధిత కుటుంబం విజ్ఞప్తి 


* వీరికి మద్దతుగా రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర నుండి బేగం బజార్ ర్యాలీలో పాల్గొన్న మర్వాడి సమాజ్

Karnataka Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, 9 మంది అక్కడికక్కడే దుర్మరణం

కర్ణాటకలోని హుబ్బళ్లి శివారు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ - ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Central Bank Of India Fire Accident: రాజేంద్రనగర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ బ్రాంచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బ్యాంకు లోపల ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయింది.

Background

కోనసీమ జిల్లా పేరు మార్చడంపై చిన్నాగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత మంత్రి ఇంటిని ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైకి దూసుకెళ్లారు. 


కలెక్టరేట్‌ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగకా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. 


- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.