తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల్లో వాటాపై న్యాయపోరాటానికి దిగుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వల్ల కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటా పోతోందని ఆరోపిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కృష్ణా ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 90 టీఎంసీల జీవోని రద్దు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ట్రైబ్యునల్‌ని కోరింది. అక్కడ నిరాశ ఎదురవడంతో... ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది జగన్‌ సర్కార్‌. తెలంగాణ 90 టీఎంసీల నీటిని వాడకుండా ఆపాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరనుంది.


90 టీఎంసీల కృష్ణాజలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 246ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం 2022లోనే.. బచావత్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసింది. ఇంటర్  లోకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసింది. అయితే... ఈ అప్లికేషన్‌ను విచారించే అధికారం తమకు లేదని.. ఆంధ్ర ప్రదేశ్‌ ఫిర్యాదును తోసిపుచ్చింది ట్రైబ్యునల్‌. తాము విచారణ  జరపబోమని..  ఈ అంశంపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించుకోవచ్చని సూచించింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. సుప్రీం కోర్టులో   స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదును బచావత్‌ ట్రైబ్యునల్ తిరస్కరించడంతో... తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణకు న్యాయం జరిగిందని, కృష్ణాలో తమకు రావాల్సిన న్యాయపరమైన వాటాను ట్రైబ్యునల్ కూడా వ్యతిరేకించలేదన్నారు బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఆరోపించారు. మరోవైపు కృష్ణా జలల్లా వాటా కోసం వెనక్కి తగ్గేదే లేదంటోంది జగన్‌ సర్కార్‌. న్యాయపరంగా కృష్ణా జలాల్లో తమకు రావాల్సిన వాటా నష్టపోకుండా... ఎంతవరకైనా పోరాడతామంటోంది. సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.


తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 246లో ఏముంది?
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణాజలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 246 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం చూస్తే.. చిన్న నీటి  పారుదల కోసం బచావత్‌ ట్రిబ్యునల్‌ తెలంగాణకు 90టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో చిన్న నీటి వనరుల వినియోగం కోసం 45 టీఎంసీలకు మించి కృష్ణాబేసిన్‌లో  వినియోగం జరగడం లేదని గుర్తించి. దీంతో 90టీఎంసీల్లో మిగిలిన 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న కృష్ణా బేసిన్‌లో వినియోగించుకోవచ్చని సూచించింది. దీని  ప్రకారం... మిగిలిన 45 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, గోదావరి ట్రిబ్యునల్‌ ప్రకారం గోదావరి జలాలను  పోలవరం ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించారు. ఇందుకోసం కృష్ణాబేసిన్‌లో మిగులు 45 టీఎంసీల నీటిని తాగునీరు, ఆయకట్టు అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించారు.  కృష్ణా జలాలను నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వాడుకునేందుకు అవకాశమున్నందున ఆ 45 టీఎంసీల నీటిని కూడా కలిపి మొత్తం 90 టీఎంసీల నికరజలాలను  రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డికి కేటాయిస్తూ జీవో జారీ చేసింది.