IND vs AUS: వన్డే ప్రపంచకప్ ముందు  మెగా టోర్నీకి  సన్నద్ధమవడానికి భారత్‌‌కు సూపర్ ఛాన్స్. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌లో భాగంగా టీమిండియా.. నేటి నుంచి ధీటైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రపంచకప్‌కు ముందు బలాబలాలను  పరీక్షించుకోవడానికి టీమిండియాతో పాటు  ఆస్ట్రేలియాకు ఇదే సువర్ణావకాశం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి కెఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగబోతున్న టీమిండియా..  ఆసియా కప్ జోరును కొనసాగించాలనుకుంటున్నది. మరోవైపు  దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ పోయినా ప్రపంచకప్‌కు ముందు భారత్‌ను  ఓడించి మెగా టోర్నీలో మరోసారి  వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టాలని  కంగారూలు భావిస్తున్న తరుణంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. తొలి సమరానికి  మొహాలీ (పంజాబ్) వేదిక కానుంది. 


వాళ్లపైనే దృష్టి 


వన్డే ప్రపంచకప్‌కు ముందే ఆసియా కప్‌లో ఎంట్రీ ఇచ్చిన  కెఎల్ రాహుల్, బుమ్రాలు  పూర్తిగా కోలుకుని మునపటి లయను అందుకోగా శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అక్టోబర్ నుంచి జరుగబోయే మెగా టోర్నీలో ఉండాలంటే అయ్యర్  ఈ సిరీస్‌లో రాణించడం  అత్యావశ్యకం. మొహాలీలో అతడు ఆడతాడనే టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది.  ఇక అక్షర్ పటేల్ కూడా గాయంతో  ఇబ్బందిపడుతున్న తరుణంలో అతడి ప్లేస్‌లో వచ్చిన  రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌‌ల మీద కూడా భారీ అంచనాలున్నాయి. వీళ్లు గనక మెరుగ్గారాణించి అక్షర్ కోలుకోకుంటే భారత వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.  ఇక వన్డేలలో పేలవ ప్రదర్శనలతో విసిగిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశం. ఈ సిరీస్‌లో సీనియర్లు గైర్హాజరీ నేనపథ్యంలో సూర్యకు తుది జట్టులో అవకాశం ఉంటుంది.  కానీ దానిని అతడు ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది ఆసక్తికరం. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జట్టు సభ్యుడిగానే ఉన్నా ఫైనల్ లెవన్‌లో చోటిస్తారో లేదో చూడాలి.  ఇక బౌలింగ్ విషయంలో ముగ్గురు పేసర్లకు  ప్రపంచకప్ ముందు అసలైన పరీక్ష.  పటిష్టమైన ప్రత్యర్థిని భారత్ పేస్ త్రయం (బుమ్రా, సిరాజ్, షమీ)తో  ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరనేది  చూడాలి. 


గాయాల ఆసీస్


ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేధిస్తున్నాయి.  సౌతాఫ్రికా టూర్‌కు దూరమైన స్మిత్, కమిన్స్‌లు తిరిగొచ్చినా స్టార్క్, మ్యాక్స్‌వెల్‌లు  తొలి వన్డేకు దూరమయ్యారు.  ట్రావిస్ హెడ్ గాయంతో వార్నర్‌తో పాటు ఓపెనర్‌గా ఎవరు వస్తారు..? అన్నది  ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్‌లో కూడా తొలి అంచె గేమ్స్‌కు  హెడ్ దూరమవుతాడని ఇదివరకే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు   ఉండే అవకాశం ఉంది.  కామెరూన్ గ్రీన్‌కు గాయం కావడంతో సౌతాఫ్రికా సిరీస్‌లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్నస్ లబూషేన్ ఫామ్ కొనసాగిస్తే అతడు వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకుంటాడు.  బౌలింగ్ విషయానికొస్తే కమిన్స్ అందుబాటులో ఉన్నా అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని ఆసీస్ క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  స్టార్క్ లేకపోవడంతో  పేస్ బాధ్యతలను కమిన్స్‌తో పాటు జోష్ హెజిల్‌వుడ్ మోయనున్నాడు. మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్ రూపంలో  ఆసీస్‌కు నాణ్యమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. స్పిన్నర్‌గా జంపాతో పాటు భారత సంతతి కుర్రాడు తన్వీర్ సంఘా తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. 


తుది జట్లు (అంచనా) : 


భారత్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్/తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ /శార్దూల్ ఠాకూర్ 


ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్,  అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా, జోష్ హెజిల్‌వుడ్ 


మ్యాచ్ వేదిక, టైమ్: 


- తొలి వన్డేకు మొహాలీ (పంజాబ్) స్టేడియం ఆతిథ్యమిస్తోంది. శుక్రవారం  మధ్యాహ్నం  1.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. 


లైవ్ వివరాలు.. 


- ఈ వన్డే సిరీస్  ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్‌లో అయితే  స్పోర్ట్స్ 18లో.. యాప్స్, వెబ్‌సైట్స్‌లో అయితే జియో  సినిమా యాప్‌లో  చూడొచ్చు. ప్రస్తుతానికైతే  జియో సినిమా యాప్ ఉచితంగానే అందుబాటులో ఉంది.