CPI Narayana : దిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివరణ తీసుకుంటుంది సీబీఐ. ఆదివారం సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుని ఈ కేసులో వివరణ తీసుకుంటున్నారు. అయితే కవితపై సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని నారాయణ విమర్శించారు. న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యక్ష ప్రసారం చేయగా లేనిది సీబీఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటంలో ఇబ్బంది ఏంటని నారాయణ ప్రశ్నించారు. గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిగితే బయటికొచ్చాక, ఎవరి వాదన వారు చెప్పుకుంటారని, వినే జనాలు పిచ్చివాళ్లు అవుతారని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
రాజకీయ కక్షసాధింపు
"ఎమ్మెల్సీ కవితను సీబీఐ దిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారిస్తుంది. కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. కేంద్రం ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతుంది. కవితపై సీబీఐ విచారణ కూడా ఇలాంటి చర్యగానే భావించాల్సి ఉంది. ఇందుకోసం మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే? ఇలాంటి దాడులు జరిపినప్పుడు లైవ్ పెట్టండి. అప్పుడు అసలు విచారణలో ఏం జరుగుతోంది ప్రజలకు, రాజకీయ పక్షాలకు తెలుస్తుంది. లేకపోతే విచారణ ముగిశాక సీబీఐ ఒకటి, కవిత మరొకటి చెబుతారు. ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థంకాదు. సుప్రీంకోర్టు కూడా చెబుతుంది లైవ్ పెట్టండని. న్యాయస్థానాల్లో జరిగే విచారణను లైవ్ ఇస్తున్నారు. అందుకే దర్యాప్తు సంస్థలు చేసే విచారణను లైవ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం" - సీపీఐ నేత నారాయణ
దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న సీబీఐ
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ బృందం ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుంది. ఆమె నివాసంలోనే విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు టీమ్‌లుగా వచ్చారు. సీబీఐ టీమ్‌లలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి కవితను ఓ సాక్షిగా మాత్రమే విచారణ చేయనున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్‌లో న్యాయ నిపుణులతో పాటు సీఎం కేసీఆర్ తో నోటీసులపై కవిత మాట్లాడారు. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.