ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే నేడు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు వస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల స్పెషల్ టీమ్ కవిత ఇంటికి చేరుకోనుంది.
మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఆమె అంగీకారంతో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నిందితులైన బోయిన్‌పల్లి అభిషేక్‌రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు అక్కడి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కవిత ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ.. నేడు ఏం జరగనుంది?
ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో స్టేట్‌మెంట్ తీసుకునేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల బృందం ఆమె ఇంటికి చేరుకోనున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ప్రశ్నలు అడగనున్నారు. ఇప్పటికే ఏయే ప్రశ్నలు అడగాలనే దానిపై సీబీఐ అధికారులు కొన్ని పాయింట్లను సిద్దం చేసుకున్నారు.సీబీఐ అధికారులు వస్తుండటంతో కవిత ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను సీబీఐ అధికారులు ఏయే ప్రశ్నలు అడుగుతారు? ఆమె ఇచ్చే సమాధానాలు ఏంటి? వివరణ ఇచ్చిన తర్వాత కవిత విషయంలో సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుంది? అనే దానిపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల హస్తం ఉండటంతో.. కవిత నుంచి అన్ని అంశాలపై సీబీఐ అధికారులు వివరణ తీసుకోవడానికి గంటల కొద్ది సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు అడిగే అవకాశముందని తెలుస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంతో కవితకు ఉన్న సంబంధం, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర, సౌత్ గ్రూప్ లావాదేవీల అంశం, ఫోన్లను ధ్వసం చేయడం లాంటి అంశాలపై సీబీఐ ప్రశ్నించనుందని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండటంతో ఆమె నుంచి వివరణ తీసుకునేందుకు సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసింది.
6వ తేదీన విచారణకు రావాలని తెలపగా.. ఆ రోజు తాను అందుబాటులో ఉండనని, 11,12,14,15వ తేదీలలో ఎప్పుడైనా వివరణ తీసుకునేందుకు రావొచ్చని కవిత సీబీఐకు లేఖ రాశారు. దీంతో ఇవాళ సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వెళుతున్నారు.ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు వెళ్లినట్లు, సౌత్ గ్రూప్‌ను కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. ఆప్ నేతలకు సగం వెనక్కి ఇచ్చేలా హోల్‌సేలర్లకు 12 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చారని, ఆప్ నేతల తరపున రూ.100 కోట్లు విజయ్ నాయర్ తీసుకున్నట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వీటిపై నేడు కవితను సీబీఐ ప్రశ్నించనుంది....
అర్ధ రాత్రి షర్మిల దీక్ష భగ్నం చేసిన పోలీసులు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. షర్మిల దీక్ష శిబిరం వద్దకు మీడియా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఈనెల 9న లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల ఆమరణదీక్షకు దిగిన విషయం తెలిసిందే.