Amararaja Telangana :   తెలంగాణలో మరో ప్రముఖ సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమరరాజా బ్యాటరీస్..  విద్యుత్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఇందు కోసం రూ. 9,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీనికి సంబంధించి అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్‌ .. తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు  హాజరయ్యారు. 






తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమరరాజా సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందన్నారు.  సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమని.. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.  


తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని గతంలో ప్రభుత్వం అమరరాజా సంస్థను కోరిందన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత మా సంస్థ పెట్టుబడులన్నీ ఏపీకే పరిమితమయ్యాయి. పలు కారణాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టలేకపోయాం. ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు  మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావించామని..అందుకే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలపై విస్తృతంగా విశ్లేషించామని.. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని అందుకే పెట్టుబడులు పెడుతున్నామని అమరరాజా ఎండీ గల్లా జయదేవ్ ప్రకటించారు. 


గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు .. చిత్తూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అమెరికా నుంచి తిరిగి వచ్చి అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను ప్రారంభించారు. పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు అక్కడే యూనిట్లు ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం కాలుష్యం ఆరోపణలతో ఆ సంస్థను మూసివేయించేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడ పెట్టుబడులు పెట్టి.. సంస్థను విస్తరించాలనుకున్న ఆలోచనను విరమించుకుని ఇతర చోట్ల అవకాశాలను కంపెనీ వెదుక్కున్నట్లుగా తెలుస్తోంది. ఒకే చోట పెట్టుబడులు పెట్టడం కన్నా పలు చోట్ల ప్లాంట్లు పెట్టడం మంచిదన్న ఆలోచనకు వచ్చి తెలంగాణను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.