Gujarat Elections:
ఎన్నికల ప్రచారంలో..
నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మరోసారి ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై పెద్ద దుమారం రేగుతోంది. మొదటి విడత ఎన్నికలు జరగక ముందు ఆయన ఓ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహింగ్యా ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. "అందరూ గ్యాస్ సిలిండర్‌ల ధర పెరిగిపోయిందని వాపోతున్నారు. త్వరలోనే ఆ ధరలు తగ్గుతాయి. ఉద్యోగాలూ వస్తాయి. కానీ...ఒకటి ఆలోచించండి. రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ పౌరులు వచ్చి మీతో పాటు ఉంటే మీకెలా ఉంటుంది..? ఇప్పటికే ఈ పరిస్థితులు ఢిల్లీలో చూస్తున్నాం. తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్‌లు వస్తే కొనుక్కోవచ్చేమో. కానీ..వాటితో ఏం చేస్తారు..? బెంగాలీల కోసం చేపలు వండుతూ కూర్చుంటారా..?" అని వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు పరేష్ రావల్. అంతే కాదు. గుజరాత్ ప్రజలు ద్రవ్యోల్బణాన్నైనా సహిస్తారేమో కానీ...ఇలా బంగ్లాదేశ్ ప్రజలు వచ్చి తమతో పాటు నివసిస్తే ఊరుకోరని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలపైనా కాస్త ఘాటుగా స్పందించారు. "వాళ్ల నోళ్లకు డైపర్‌లు వేసుకోవాలి. అలా మాట్లాడుతున్నారు" అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు మరోసారి బీజేపీపై భగ్గుమన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్ ట్విటర్ వేదికగా మండి పడ్డారు. పరేష్ రావల్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ విమర్శలు చేశారు. "బాబు గారు. మీరు గతంలోలా లేరు. బంగ్లాదేశ్ పౌరులు, రోహింగ్యాలు భారత్‌లోకి వచ్చారంటే హోం మంత్రి అమిత్‌షా సరిగా పని చేయడం లేదని అర్థం" అని సెటైర్ వేశారు.
అయితే...ఇది వివాదాస్పదం అయ్యాక పరేష్ రావల్ స్పందించారు. "చేపలు వండుకోవడం అనేది అసలు విషయమే కాదు. గుజరాతీలు వాటిని వండుకుని తినవచ్చు. బెంగాలీలు అంటే నా దృష్టిలో అక్రమంగా మన దేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్ పౌరులు, రోహింగ్యాలు అని అర్థం. అయినా ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే వారికి నేను క్షమాపణలు చెబుతున్నాను" అని ట్విటర్ వేదికగా వెల్లడించారు.