హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన దుర్ఘటన ఇప్పుడు కొత్త టెన్షన్‌కు కారణమైంది. నాటు తుపాకులతో దుండగులు వచ్చి బంగారాన్ని ఎత్తుకెళ్లడం పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా లక్షల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. నిత్యం నిఘా ఉండనే ఉంటుంది. అయినా ఇంత దర్జాగా వచ్చి షాపు వాళ్లను బెదిరించి వెళ్లడం విస్మయానికి గురి చేస్తోంది.
నిందితులు పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ దోపిడీకి స్కెచ్ వేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రతి గురువారం బంగారం వస్తుందని ముందే తెలుసుకొని రెక్కీ చేసి దాడి చేశారు. బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్ని ఫాలో అయ్యారు ఈ నలుగురు దుండగులు. ఆభరణాలని కళ్యాణ్ చక్రవర్తికి ఇస్తున్న సమయంలో దుండగులు షాప్‌లోకి చొరబడ్డారు. బంగారం తీసుకొని దుండగులు పారిపోతున్న సమయంలో స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.
దుండగులు రాజాస్థాన్, హరియాణా, యూపీ గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పల్సర్ బైకు, మరో యాక్టివ బైక్‌పై దుండగులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు బుల్లెట్ కేస్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల్లో అక్కడ పని చేస్తున్న వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో చికిత్స అందిస్తున్నారు.
రాచకొండ సీపీ మహేష్ భగత్... బాధితులను పరామర్శించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేస్తున్నామని వివరించారు.
హైదరాబాద్‌లోని నాగోల్ స్నేహపురి కాలనీలో నలుగురు దుండగులు వీరంగం సృష్టించారు. కంట్రీ మేడ్ తుపాకులతో మహాదేవ్ బంగారం షాప్‌లోకి దూరి, కాల్పులతో విరుచుకుపడ్డారు. సరిగ్గా షాప్ మూసే సమయంలో లోపలికి వెళ్లి యజమానిని బెదిరించి, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ పెనుగులాటలో కళ్యాణ్ చక్రవర్తి, సుఖఃదేవ్‌కి గాయాలయ్యాయి. స్నేహపురి కాలనీలోని ప్రధాన రోడ్‌లో ఉన్న మహదేవ్ జ్యువెలరీ షాప్‌లో ఈ దారుణం జరిగింది.
రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో బంగారం కొనుగోలు చేస్తామని చెప్పి షాప్ లోపలికి ఇద్దరు దుండగులు వెళ్లారు. బయట మరో ఇద్దరు ఉన్నారు. లోపలికి వెళ్లిన వెంటనే, షట్టర్‌ని మూసివేశారు బయట ఉన్న వ్యక్తులు. ఆ వెంటనే లోపల ఉన్న వ్యక్తులు తమతో తెచ్చుకున్న తుపాకులు బయటకు తీసి.. షాప్ యజమాని కళ్యాణ్ చక్రవర్తితోపాటు వర్కర్లపై కాల్పులు జరిపారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, అక్కడి నుంచి దుండగులు పారిపోయారు.
కాల్పుల శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ లభ్యమైన తుపాకీ బుల్లెట్ షేల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్ షాప్‌లో దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.