ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భార్యకు ఐటీశాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ నోటీసులు నెల రోజుల క్రితమే అందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధిత చట్టం-1988’ (Prohibition of Benami Property Transactions Act) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా పరిధిలోని ఆస్పరి మండలం ఆస్పరి, చిన్నహోతూరు గ్రామాల సమీపంలో మంత్రి దాదాపు 180 ఎకరాల వరకూ తన కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేశారు. 2020 మార్చి 2వ తేదీన ఈ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందులో ఆయన భార్య రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు ఉంది. మొత్తం రూ.52.42 లక్షలకు ఆ భూములు కొనగా ఒక్కో ఎకరా రూ.1.75 లక్షలు పడిందని తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం నగదు ఎక్కడిది, ఎలా చెల్లింపులు చేశారో చెప్పాలని హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసు నుంచి మంత్రి భార్యకు నోటీసులు అందాయి. అంతేకాకుండా సదరు 30.83 ఎకరాలను కూడా అటాచ్‌ చేశారు.


బినామీ వ్యవహారమే...


మంత్రి భార్యతో బినామీ లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తూ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రూ.50 లక్షలు ఎలా చెల్లింపులు చేశారు? ఇన్‌కం సోర్స్ ఏంటి? అని అడిగింది. లెక్కల్లో చూపని ఆదాయం నుంచే ఈ చెల్లింపులు చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఐటీ అధికారులు. అలాగే ఆస్పరి గ్రామంలో ఇతినా మంజునాథ్‌ నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రి జయరాం స్వయంగా మీడియాకు వెల్లడించారని కూడా నోటీసులో వెల్లడించింది. ‘‘డాక్యుమెంట్‌ నంబరు 552/2020లో నమోదు చేసిన విక్రయ లావాదేవీలు పీబీపీటీ చట్టం (Prohibition of Benami Property Transactions Act) లోని సెక్షన్‌ 2(9)(ఏ) ప్రకారం బినామీ లావాదేవీలని తెలుస్తోంది. మంత్రి జయరాంకు చెందిన రహస్య ఆదాయ వనరుల నుంచే ఆ చెల్లింపులు చేశారని తెలుస్తోంది. రేణుకమ్మ పేరుతో కొనుగోలు చేసిన 30.83 ఎకరాలను ఈ నోటీసు జారీ చేసిన రోజు నుంచి 90 రోజుల పాటు తాత్కాలికంగా అటాచ్‌ చేస్తున్నాం’’ అని ఐటీ అధికారులు పేర్కొన్నారు.


మంత్రి స్పందన ఇదీ


తాము ఆ భూములు కొన్నట్లుగా మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు. తమది ఉమ్మడి కుటుంబం అని, దాదాపు వారసత్వంగా వంద ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఆ పంటల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం, అప్పులు చేసి ఆ భూములు కొన్నామని వివరణ ఇచ్చారు. 52 చెల్లించి 30 ఎకరాలు నేను కొనలేనా? మేం ఏ అక్రమాలూ చేయలేదు. ఎవరినుంచి లాక్కోలేదు. బినామీ అనేది లేనే లేదు. నా తమ్ముడి భార్య, మరో తమ్ముడి భార్య పేరున పొలం తీసుకున్నాం. అంతే, ఐటీ అధికారుల నోటీసులు అందలేదు. ఒకవేళ మమ్మల్ని వివరణ అడిగితే అన్ని ఆధారాలు చూపిస్తాం.’’ అని చెప్పారు.


ఈ భూములు బెంగళూరుకు చెందిన ఇతినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది. ఆ సంస్థ 2006లో ఈ భూములు కొనుగోలు చేయగా.. 2020 మార్చి 2వ తేదీన మంత్రి సతీమణి పేరుతో 30.83 ఎకరాలు, ఆమె తోడికోడళ్ల పేరుతో 149.17ఎకరాల రిజిస్ట్రేషన్‌ జరిగినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తం 180 ఎకరాలు చేతులు మారగా.. మంత్రి సతీమణి పేరుపై ఉన్న 30 ఎకరాల విషయంలో నోటీసులు అందాయి.