Indravelli Martyrs Day :  అడవి బిడ్డల హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీ గిరిజన అమరవీరులకు ఏటా ఏప్రిల్ 20న నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారంతో 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని ఆదివాసీ గిరిజనులు, ఆదివాసీ సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అమరవీరులకు నివాళులర్పించడానికి మండలంలోని వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివాసీలు మొదటగా తమ సంప్రదాయ పద్ధతిలో ఆదివాసీల ఆరాధ్య దైవం ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని గోండుగూడ నుంచి ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని సంప్రదాయ వాయిద్యాలైన డోల్, పేప్రే, కాళీకోమ్, తుడుం మోతల మధ్య అత్యంత వైభవంగా అమరవీరుల పేరిట స్థూపానికి ఎదురుగా ఉన్న ప్రతీక జెండాలను ఆవిష్కరించి అమరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరులారా వందనం... అమరులారా వందనమంటూ... ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న పాటను పాడారు. అమరులకు ఘన నివాళి అర్పించారు. 1981 ఏప్రిల్ 20న జల్...జంగల్...జమీన్ పేరిట నినదించి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధువులు, జిల్లా ఆదివాసీలు తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యంలో ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 


ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాటం


ఆదివాసీలకు భూమి హక్కుల పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య అన్నారు. గురువారం ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజన అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని అసెంబీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్‌ ఆదివాసీలపై దాడులు జరుగుతుంటే కనిపించడం లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వమే పోలీసులు, ఫారెస్టు అధికారులతో దాడులు చేయిస్తుందని ఆరోపించారు. ఫారెస్టు అధికారులు మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.


ఓట్లకోసమే పోడు పట్టాలు- వైఎస్ షర్మిల


ఓట్లకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తానని అంటున్నారని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గురువారం ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలపై  నిజంగానే ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  అసెంబ్లీలో ఆదివాసీ బిడ్డలకు పోడు భూములపై హక్కు ఉందని చెప్పి ఇప్పుడేమో షరతులతో కూడిన పట్టాలు ఇస్తానని అంటున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవాల్సి ఉండగా ఒక్క ఎకరానికి కూడా ఇవ్వకుండా లక్షల ఎకరాల్లో ట్రెంచ్‌లు వేసి మొక్కలు నాటారన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణలో అడవి బిడ్డలు బలవుతూనే ఉన్నారన్నారు. ప్రశ్నించిన, పోరాడిన గిరిజనులపై కేసులు పెట్టారన్నరు. గెలిచిన 6 నెలల్లో కుర్చీ వేసుకుని పోడు పట్టాలిస్తామని కేసీఆర్ మోసం చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా 6 సార్లు అబద్దం చెప్పారని షర్మిల విమర్శించారు. ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వడానికి కుర్చీలు లేవా? లేక చిత్తశుద్ధి లేదా?


పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి


అటవీభూములు సాగు చేసు కుంటున్న ఆదివాసీ గిరిజనులకు పోడు పట్టాలను ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇంద్రవెల్లి ఆదివాసీ గిరిజన అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ పోడుభూముల సమస్య ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి కుర్చీ వేసుకుని సమస్యను పరిష్కరిస్తానన్నావని ఆ మాటలన్నీ బూటకపు మాటలేనా? ఇచ్చిన హామీలన్నీ ఉత్తివేనా అన్నారు. ప్రస్తుత రాష్ట్ర పాలన ప్రజల పాలన కాదని ముమ్మాటికీ కేసీఆర్‌ పాలన కొన సాగుతుందన్నారు. ఇకనైనా దశాబ్దాలుగా పేదలు గిరిజనులు, ఆదివాసీలు అటవీ భూములను నమ్ముకుని దానిపైనే అధారపడి బతుకుతున్న వారికి అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులకు పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరులకు న్యాయం చేస్తాం


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఆదివాసీ మృత వీరులకు ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడగానే తాను స్వయంగా ఇంద్రవెల్లి అమరులకు ముందుగా న్యాయం చేస్తామన్నారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.