Cardiac Arrest: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి 30 ఏళ్ల వయసు వారు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూనో, కాలేజీలో స్నేహితులతో కబుర్లు చెబుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ నడుస్తూ, పని చేసుకుంటూనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా ఏపీలో పేపర్ వేల్యూషన్ చేస్తూ ఓ టీచర్, తెలంగాణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఎమ్మార్వో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. 


అసలేం జరిగిందంటే..?


మహబూబాబద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక తహసీల్దార్ కూడా హాజరయ్యారు. అయితే రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కారు డ్రైవర్ వెంటనే ఎమ్మార్వోను కారులో కేసముద్రం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యునికి చూపించగా తహసీల్దార్ గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించి వెంటనే మహబూబాబాద్  కు తరలించాలని సూచించారు. ఈ క్రమంలోనే డ్రైవర్ ఎమ్మార్వోను వెంటనే మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడి సిబ్బంది సీపీఆర్ చేసి చికిత్స అందించారు. కానీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎమ్మార్వో మృతి చెందారు. తహాసీల్దార్ కు గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలుసుకొని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తమతోపాటు అప్పటి వరకు కలిసి మెలిసి ఉన్న తహసీల్దార్ కొద్ది క్షణాల్లోనే మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఎమ్మెల్యే చెప్పారు. తహాసిల్దార్ ఫరీదుద్దీన్ స్వస్థలం హన్మకొండ కాగా భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కేసముద్రం తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 


ఏపీలో పేపర్ వేల్యూషన్ కు వెళ్లి టీచర్ మృతి 


బాపట్ల  జిల్లా మున్సిపల్ స్కూల్ లో మూల్యాంకనం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు(48) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పేపర్ దిద్దుతూ ఒక్కసారిగా కుప్ప కూలి‌ పడిపోయిన శ్రీనివాసరావు.. బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ తో‌‌ మృతి చెందినట్లు వైద్యల‌ వెల్లడించారు. అయితే శ్రీనివాస రావు పర్చూరులో గణిత ఉపాద్యాయుడుగా పని చేస్తున్నాడు. 


ఇటీవలే ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి


పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అప్పటివరకు బాగున్న బాలుడు భోజనం చేసిన తర్వాత నుంచి ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరాడడం లేదని తన స్నేహితులతో చెప్పాడు. వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపగా వెంటనే వారు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. బాగా చదువుకొని తమకు చక్కగా చూసుకుంటాడని అనుకున్న కొడుకు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఏంటా అని కన్నీరుమున్నీరవుతున్నారు.