Bhatti Vikramarka Padayatra : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఉట్నూర్ ఎక్స్ రోడ్ వరకు నాలుగో రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఇంద్రవెల్లిలో పాదయాత్రగా బయలుదేరిన భట్టి విక్రమార్కను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలని ఉద్యమిస్తున్నా పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా చట్టబద్ధత లేని లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నం. 3 పునరుద్ధరణ , ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు ఎలాంటి షరతులు లేకుండా హక్కు పత్రాలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం 11 తెగలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మావల మండలంలోని సర్వే నం 72 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసీల గుడిసెలను తొలగించి వెళ్లగొట్టేందుకు బడా నాయకులు చేస్తున్న ప్రయత్యాన్ని అణచివేసే దిశగా కృషి చేయాలని ఆదివాసీలకు రక్షణ కల్పించి పక్కా ఇళ్లు నిర్మించుకునేలా సహయపడాలన్నారు.
మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు - భట్టి
'మీరెవరు మీ గుడిసెలను తీసేయొద్దు. గుడిసె వేసుకోవడం మీ హక్కు. మీ హక్కును కాల రాస్తే ఊరుకోను. మీకోసం ఎక్కడి వరకైనా పోరాటం చేస్తా' అని ఆదివాసీలకు భట్టి భరోసా అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2000 మంది గిరిజనులు వేసుకున్న గుడిసెలను ఖాళీ చేయించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తుడుం దెబ్బ నాయకులు ఇంద్రవెల్లిలో భట్టి విక్రమార్కను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఇంద్రవెల్లి పాదయాత్రలో ఖమ్మర పని చేసుకునే లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన భట్టి.. ఆయన కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. సీఎల్పీ నేతతో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాకెలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అధైర్యపడవద్దని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని లక్ష్మణ్ కు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
పులిమడుగులో భట్టికి స్వాగతం పలికిన మహిళలు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పులిమడుగు గ్రామస్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పలు సమస్యలను భట్టి దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్థులు. మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజా ప్రభుత్వంలో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భట్టి గ్రామస్థులతో చెప్పారు. పాదయాత్రలో జనం ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ విద్వేషాలతో దేశాన్ని విడగొట్టుతుందన్నారు. దేశ సంపద కొంత మందికి పంచుతున్నారని ఆరోపించారు. మోదీ పాలనలో ఆర్థికంగా ఉన్నవారు, లేనివారనే అసమానతలు పెరిగాయన్నారు. ఆర్థిక అసమానతలతో దేశాన్ని రెండుగా చీలుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న బీజేపీ నుంచి జాతిని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ భారత్ జూడో చేశారని తెలిపారు. భారత్ జోడో కొనసాగింపుగానే హాథ్ సే హాథ్ పాదయాత్ర చేపట్టినట్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను పాదయాత్ర చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ కాదు బ్రిటీష్ ప్రభుత్వం
"తెలంగాణ లక్ష్యం చేరుకోకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వానికి బుద్ది చెబుదాం. పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశ పడ్డాం. చివరకు అడవుల్లోకి రానివ్వడం లేదు. అడవి సంపదకు దూరం చేయడమే కాదు వారిని బయటకు పంపిస్తున్నారు. అటవీ సంపద అంతా వారిదే. వద్దనడానికి నువ్వెవరు. బ్రిటిష్ ప్రభుత్వం తరహాలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల విషయంలో ప్రవర్తిస్తుంది. జన్నారంలో చేపల వేటకు వెళ్తే కేసులు పెట్టారు. ఫ్రెంచ్, పోర్చు గీస్, బ్రిటిష్ ప్రభుత్వమా ... వేరే దేశం ప్రభుత్వం అన్నట్లుగా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మూడేళ్లుగా కుండలు చేసుకోవడానికి అడవి నుంచి మట్టి కూడా తీసుకోనివ్వడం లేదు. కట్టెలు తెచ్చుకొనివ్వడం లేదు. సాగు నీళ్లు ఇవ్వరు. బోర్లు వేసుకొవ్వరు అడవి నుంచి గిరిజనులను ఖాళీ చేయించే అతిపెద్ద కుట్ర చేస్తున్నారు. " - భట్టి విక్రమార్క
టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ ను తొలగించాలి
పేపర్ లీకేజీతో నిరుద్యోగుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ సభ్యులను సెక్రెటరీని వెంటనే తొలగించాలన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును నియమించిందేవరో వారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైలు ప్రమాదం జరిగితే కేంద్రంలో ఉన్న రైల్వే మంత్రి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారని గుర్తుచేశారు. పేపర్ లీకేజీ తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం పెట్టిన ఖర్చు అభ్యర్థులకు ఇవ్వాలన్నారు. టీఎస్పీఎస్సీని నియమించిన వారు మంత్రా, ముఖ్యమంత్రా ఎవరూ నియమిస్తే వాళ్లే రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలేనని విమర్శించారు. ధరణి పోర్టల్ తో ఆదిలాబాద్ జిల్లా వాసులే ఎక్కువగా నష్ట పోయారన్నారు.