Adilabad News : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ కు చెందిన రాథోడ్ మనోజ్ (35) అనే రైతు సోమవారం తన పొలంలో పంటకు పురుగుల మందు కొడుతుండగా భారీ వర్షం కురిసింది. మందు కొడుతూ దగ్గరలోని చెట్టు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా  అతడిపై పిడుగు పడటంతో మనోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. 


చేనులో పనిచేస్తుండగా 


కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్ మండలం గోపాల్ పూర్ గ్రామంలో పొలంలో పనికోసం వెళ్లిన అజయ్ (17) అనే యువకుడు వర్షం కురుస్తుండటంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ యువకుడిపై పిడుగు పడటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.  కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో మధ్యాహ్నం కురిసిన వర్షానికి పత్తి చేనులో పని చేసుకుంటున్న తండ్రి కొడుకులపై పిడుగు పడింది. సుంగాపూర్ గ్రామానికి చెందిన బొమ్మన లచ్చయ్య.. ఆయన కొడుకు శ్రీరామ్ తమ పంట చెనులో పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో కొడుకు శ్రీరామ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోగా.. తండ్రి లచ్చయ్యకి స్వల్ప గాయాలయ్యాయి. పక్క చేనులోని వ్యవసాయ కూలీలు వెంటనే తండ్రి లచ్చయ్యతో పాటు కొడుకు శ్రీరామ్ లను హుటాహుటిన సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కొడుకు శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిర్యాణి మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి శ్రీరామ్ మృతిచెందడాని డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 


కాకినాడ వాకపూడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు 


కాకినాడలోని వాకపూడి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గత పది రోజుల క్రితం కూడా ఇధే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఇద్దరు కార్మికులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వర రావుగా గుర్తించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 


సీ ఫ్యాన్ గడ్డర్ పడి ప్రమాదం 


సీ ఫ్యాన్ గడ్డర్ పడి ఈ ప్రమాదం జరిగినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 4వ అంతస్తులో ఉన్న గడ్డర్ మొదటి అంతస్తులో పని చేస్తున్న కార్మికులపై పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారని వివరించారు. ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరం అని కాకినాడ ఆర్డీఓ తెలిపారు. ప్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫ్యాక్టరీలోని బధ్రతా చర్యలు అన్నీ తనిఖీ చేసే వరకు ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులు, ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికులతో చర్చించి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. 


Also Read : Peddapalli News : సీఎం కేసీఆర్ సభలో యువకుడు ఆత్మహత్యాయత్నం


Also Read : Nirmal News : రాజకీయ నేతలు బీఅలెర్ట్, సివిల్ డ్రెస్ లలో మావోల సంచారం!