Nirmal News : నిర్మల్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో మావోయిస్టులు సివిల్ దుస్తులలో తిరుగుతున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం ఉందని ఎస్పీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మావోయిస్టుల సంచరిస్తున్నారన్న సంచారంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో నుంచి నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. మావోయిస్టులకు ఎవరు సహకరించొద్దని, గ్రామాల్లో ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మావోయిస్టుల నుంచి ముప్పున్న రాజకీయ నాయకులు, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులకు, వారి సానుభూతిపరులకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మావోయిస్టుల వివరాలు తెలిపిన వాళ్లకు రివార్డులు అందిస్తామని, వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మావోయిస్టుల పోస్టర్లను విడుదల చేశారు. 



అనుమానంగా కనిపిస్తే 


"ఆగస్టు మొదటి వారంలో కొంత మంది మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ , మహారాష్ట్ర సరిహద్దుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలైన అసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టులు సివిల్ డ్రెస్ లో సంచరిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం వచ్చింది. అటవీ ప్రాంతంలో ఎవరైన అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించండి. ఇలాంటి అరాచక శక్తులకు ఎట్టి పరిస్థితిలో అందించవద్దని, అలా ఎవరైనా సాయం చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. మావోయిస్టుల సమాచారం అందిస్తే వారికి తగిన గుర్తింపు, బహుమతి అందిస్తాం. ప్రజాస్వామ్యదేశంలో ఇలాంటి అరాచక శక్తులకు స్థానం లేదు. శాంతియుతమైన వాతావరణం తెలంగాణలో కొనసాగుతుంది. కొన్ని శక్తులు శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో ఎవరైనా అనుమానంగా కలిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లలో సమాచారం అందించండి. ఈ సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతాం." - ఎస్పీ ప్రవీణ్ కుమార్


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇంతకాలం ప్రశాంతంగానే ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలతో హైటెన్షన్ కనిపిస్తోంది. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మీదుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే పక్కా సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ ఎస్పీలు ఉదయ్ కుమార్ రెడ్డి, కే.సురేష్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందాలు యాక్ష షురూ చేశాయి. జిల్లా అడవుల్లో ప్రత్యేక పోలీస్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు లేఖలు విడుదల చేయడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంతలోనే “మంగి - ఇంద్రవెల్లి” దళం పేరిట హెచ్చరిక లేఖలు సైతం విడుదలయ్యాయి. గతంలో పోలీసులకు దొరికినట్లే దొరికి.. తప్పించుకున్న మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు జిల్లా అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అడవులు దట్టంగా మారడంతో మావోయిస్టుల కదలికలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


Also Read : Lawyer Karuna Sagar Letter: ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి - హైకోర్టు సీజేకు రాజాసింగ్ లాయర్ లేఖ!


Also Read : ఆదిలాబాద్ అడవుల్లో అలజడి- ఏజెన్సీ గ్రామాల్లో ఖాకీల నిఘా!