తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా ఒకటే అంశంపై రాజకీయం జరుగుతోంది. ఆరేళ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేయడం స్థానికులతో పాటు ప్రజలందర్నీ కలచివేస్తోంది. నిందితుడు పల్లకొండ రాజును పట్టిస్తే రూ.10 లక్షలు అందిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సైతం నిన్న భారీ రివార్డ్ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. మరోవైపు బాధిత కుటుంబాన్ని అన్ని పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు.


సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి ఉదంతంపై తెలంగాణ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్  తీవ్రంగా స్పందించారు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టమని, నిందితుడు, ఆటో డ్రైవర్ రాజును ఎలాగైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ ఆఫీసు నిర్మాణం పనులు, మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 


Also Read: Telangana Nirbhaya : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?


ఘటన జరిగిన రోజు నుంచి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, టీమ్ లుగా ఏర్పడి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుడు రాజును పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలు, ఘటనపై డీజీపీ, సీపీ, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నానని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆరేళ్ల చిన్నారిపై ఇంత దారుణానికి పాల్పడిన రేపిస్ట్ రాజును త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత చిన్నారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అభంశుభం తెలియని చిన్నారులపై ఇలాంటివి జరగడం దారుణమన్నారు. 


Also Read: సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు.. సీపీ ప్రకటన


మెడికల్ కాలేజీ కార్యరూపం దాల్చడంపై హర్షం..
మహబూబాబాద్ జిల్లా మెడికల్ కాలేజీ కార్యరూపం దాల్చడంలో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రూ.30 కోట్లతో నర్సింగ్ కాలేజీకి టెండర్ పూర్తి అయ్యిందని.. అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. నర్సింగ్ కాలేజీ నిర్మాణం పూర్తయితే, ముందుగా మెడికల్ కాలేజీ నిర్వహిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ ఏరియా హాస్పిటల్ లో 300 పడకల ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 


Also Read: Saidabad Girl Case Update: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. రంగంలోకి సజ్జనార్.. ఈసారి ఇలా ఆదేశాలిచ్చారు