వైఎస్​ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. హంతకులను గుర్తించేందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా మరికొందరు నిందితుల అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివేకా ఇంట్లోకి నిందితులు ఏవిధంగా ప్రవేశించారు, హత్య చేసి ఎలా పారిపోయారనే అంశంపై  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.


కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో రెండో రోజు సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేకా ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియ కొనసాగింపుగా ఇవాళ కూడా జరిగింది. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారన్న దానిపై సీబీఐ ఆరా తీస్తోంది.


వివేకా హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. నలుగురు వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లను చొక్కాలకు అంటించుకొని సీబీఐ ట్రయల్స్‌ చేస్తోంది.


వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని అరెస్ట్ చేయగా... డ్రైవర్ దస్తగిరిని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. హత్యాస్థలంలో దస్తగిరి ఉన్నట్లు భావిస్తే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎర్ర గంగిరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కిందట ఐపీసీ సెక్షన్ 201 కింద సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు.


వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019 మార్చి 15న తెల్లవారుజామున వివేకా హత్య జరిగింది. మార్చి 14వ తేదీ రాత్రి వివేకా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుల వివరాలపై సీబీఐ ఆరాతీస్తోంది. వివేకా హత్య జరిగిన బాత్ రూం, బెడ్ రూం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు.  హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా ఇంటికి సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పల్సర్ బైకులో గొడ్డలి తీసుకుని వచ్చినట్లు ఇటీవల పులివెందుల కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో సీబీఐ పేర్కొంది. మరికొందరు నిందితులు ఇంట్లోకి వచ్చారనే సమాచారం మేరకు సీబీఐ ట్రయల్ నిర్వహించింది.


Also Read: CBI Today : రఘురామ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు .. ఏ క్షణమైనా జగన్ బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు !


Also Read: Engineer’s Day: మూసీ వరదల నుంచి హైదరాబాద్ ను రక్షించిన మహనీయుడు... మోక్షగుండం విశ్వేశ్వరయ్య