ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై తీర్పు చెప్పేందుకు మార్గం సుగమం అయింది. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని మంగళవారం రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్స్‌పల్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. తాను దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను ఆ బెంచ్‌ నుంచి బదిలీ చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. మంగళవారం ఆయన పిటిషన్ పై విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ చేశారు. బుధవారం ప్రకటించారు.  జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించింది.  రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును ప్రకటించడానికి సీబీఐ కోర్టుకు మార్గం సుగమం అయింది. 
  Also Read : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న నేరాలు
మరో వైపు జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షిమీడియా పై రఘురమకృష్ణరాజు దాఖలు చేసిన  కోర్టు ధిక్కరణ పిటి,న్‌పై సీబీఐ కోర్టు విచారణ ముగించింది. కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. గత నెల 25వ తేదీన సీబీఐ కోర్టు తీర్పు రాక ముందే సాక్షి వెబ్ మీడియాలో తీర్పును ప్రకటించారు. ఇది కుట్రపూరితమని కోర్టు ధిక్కరణ అని ఆరోపిస్తూ రఘురామ పిటిషన్ వేసారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. సాక్షి ఎడిటర్‌తో పాటు సీఈవో కూడా విచారణకు హాజరయ్యారు. తమ ఉద్యోగి తప్పిదమేనని వారు వివరణ ఇచ్చారు. విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంది కాబట్టి బదిలీ చేస్తున్నట్లుగా తెలిపింది.


Also Read : చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు..


జగన్, విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. వారు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ ఇద్దరి  బెయిళ్లను రద్దు చేయాలని విడివిడిగా రఘురామ పిటిషన్లు వేశారు. విడివిడిగానే విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు తీర్పును వెల్లడించాల్సి ఉంది. ఈ లోపే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ కారణంగా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కోర్టు తీర్పుపై రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండటంతో ఒక వేళ బెయిల్ రద్దు అయితే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈ అంశంలో వైసీపీ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 


Also Read : ముసలి మొగుడు - పడుచు పెళ్లాం" మోసాలు